
KTR: తెలంగాణలో రాజకీయం రసకందాయంలో పడింది. ఇన్నాళ్లూ మాటల తూటాలకే పరిమితమైన అధికార విపక్షాల వైరం.. ప్రత్యక్ష దాడులకు వెళ్లేలా కనిపిస్తోంది. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేతను అధికార బీఆర్‌ఎస్ సహించలేకపోతోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇంటరాగేట్ చేయడం, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ ఎపిసోడ్‌తో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను, కల్వకుంట్ల కుటుంబాన్ని ఇరుకున పెడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ను తాజా పరిణామాలు తీవ్ర అసహనానికి గురిచేస్తున్నాయి. దీంతో విపక్షాలను, అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపే వ్యతిరేక మీడియాపై బీఆర్‌ఎస్ భౌతిక చర్యలకు దిగుతోంది.
విపక్ష నేతలకు నోటీసులు.. జర్నలిస్టుల అరెస్ట్‌లు..
తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి ఎదురవుతున్న వరుస పరాభవాలను ఆ పార్టీ నేతలు యావత్ తెలంగాణకు ఆపాదించేందుకు మొదట ప్రయత్నించారు. కల్వకుంట్ల కుటుంబ వైఫల్యాలను తెలంగాణ మొత్తంపై రుద్దే ప్రయత్నం చేశారు. అయితే అధికార పార్టీ వ్యతిరేక మీడియా, సోషల్ మీడియా, విపక్షాలు ఆ ప్రయత్నాలకు గండి కొట్టాయి. తప్పు కల్వకుంట్ల కవిత చేస్తే దానిని తెలంగాణ మహిళలపై దాడిగా చూపే ప్రయత్నం చేస్తున్నాయని విస్తృత ప్రచారం చేశాయి. దీంతో ప్రజలు వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. దీంతో కవిత కోసం రోడ్లెక్కుతారనుకున్న ప్రజలు గడప దాటడం లేదు. బీఆర్‌ఎస్ క్యాడర్ కూడా కవిత చేసిన తప్పుకు ఆందోళన చేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అన్న భావనలో ఉన్నారు. దీంతో తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ అటాక్ పాలిటిక్స్ మొదలు పెట్టిరు. అధికారం చేతిలో ఉండడంతో పోలీసులను విపక్షాలు, జర్నలిస్టులపైకి ఉసిగొల్పుతున్నారు. కేటీఆర్‌పై ఆరోపణలు చేశారన్న కారణంతో రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌కి నోటీసులు ఇప్పించారు. ఇక సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న తొలి వెలుగు రఘును తప్పించారు. క్యూ న్యూస్ ఆఫీస్‌పై తన అనుచరులతో దాడి చేయించారు. తాజాగా చానెల్ యజమాని చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయించారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు కాదు..
హిందుత్వంపై ట్వీట్ చేసినందుకు కన్నడ నటుడు చేతన్ అహింసాను అరెస్టు చేయడంపై కేటీఆర్ స్పందిస్తూ, ‘బీజేపీ పాలించిన కర్ణాటకలో అభ్యంతరకరమైన ట్వీట్ కోసం 14 రోజుల జైలు శిక్ష విధించబడింది. తెలంగాణలో, మా ముఖ్యమంత్రి, మంత్రులు మరియు శాసనసభ్యులను ప్రత్యక్షంగా, భయంకరమైన అవమానాలను మేము సహిస్తున్నాము. మనం వాటిని అదే నాణెంలో తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది, ప్రజలు ఏమంటారు? భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం హక్కు కాదు అని ప్రజలను కూడా రెచ్చగొట్టేలా ట్వీట్ చేశారు.

బీఆర్‌ఎస్‌లో కలవరపాటు..
అయితే ముఖ్యమైన మంత్రి కేటీఆర్ చర్యలు ఆ పార్టీ నేతలనే కలవరపెడుతున్నాయి. ఇలా కక్ష్యసాధింపునకు దిగితే ఎన్నికల ఏడాదిలో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు, మీడియా వ్యతిరేకుల టార్గెట్ చేయడం వంటి చర్యలు ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపుతాయని కలవరపడుతున్నారు. మొత్తంగా కేటీఆర్ వ్యాఖ్యలు, ట్వీట్‌ను బట్టి ఎన్నికల సంవత్సరం కావడంతో బీఆర్‌ఎస్ తన ప్రత్యర్థులపై గట్టి చర్యలకు దిగే అవకాశం కనిపిస్తోంది.