King Cobra: సాధారణంగా పాములంటే చాలామందికి భయం ఉంటుంది. అక్కడ పాము ఉందంటే అటు పక్కకు వెళ్ళరు. చిన్న పాములకే మనం ఇంతగా భయపడితే.. కింగ్ కోబ్రా లాంటి పాములను దగ్గరగా చూస్తే ప్రాణాలు పోతాయి. అంతలా ఉంటుంది దాని ఆహార్యం. ఇండియాలో కింగ్ కోబ్రాలు చాలా తక్కువ. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే తాజాగా ఏపీలోని అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్ కోబ్రా ఒక్కటి వెలుగు చూసింది.
మాడుగుల మండలం ఎం. కోడూరులో 13 అడుగుల పొడవున్న ఈ కింగ్ కోబ్రా మరో పామును వెంబడిస్తూ కోళ్ల గూట్లోకి దూరింది. గ్రామానికి చెందిన ఎలమంచిలి రమేష్ అనే రైతు తన పొలంలో కోళ్లను పెంచుతున్నాడు. కోళ్లను ఉంచిన గూట్లోకి కింగ్ కోబ్రా దూరింది. దీంతో పాములు పట్టడంలో నిపుణుడైన వెంకటేష్ అనే వ్యక్తికి సమాచారం అందించారు. 13 అడుగుల పాము కావడంతో పట్టుకోవడం కష్టతరంగా మారింది.
వెంకటేష్ దాదాపు అరగంట పాటు శ్రమించి పామును పట్టుకున్నాడు. అప్పటికే అది బుసలు కొడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చివరకు పట్టుబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. పామును పట్టుకున్న వెంకటేష్.. దానిని అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.