Nagababu: ఏపీలో పొత్తుల కసరత్తు జరుగుతోంది. ప్రతిపక్షాల పొత్తుకు ముహుర్తం ఖరారవుతోంది. అన్నీ కుదిరితే త్వరలోనే ప్రకటన రాబోతోంది. జనసేన, టీడీపీలు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చాయి. ఇక ప్రకటనే తరువాయి. జనసేన నేత నాగబాబు ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. పవన్ త్వరలో పొత్తుల ప్రకటన చేస్తారని చెప్పారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రెండు సార్లు సమావేశమయ్యారు. వివిధ అంశాల పై చర్చించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తులు ఖాయమని చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలో పొత్తుల పై కీలక విషయాన్ని మెగాబ్రదర్, జనసేన నేత నాగబాబు చెప్పారు. ప్రతిపక్షాలను కలుపుకుపోయే ప్రయత్నం పవన్ చేస్తున్నారని నాగబాబు అన్నారు. పొత్తులు ఏ పార్టీతో అన్న విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని చెప్పారు. పొత్తులు ఖరారైన తర్వాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్న అంశం పై నిర్ణయం జరుగుతుందన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశం పై పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఉన్నారని చెప్పారు.
జనసైనికులు, వీరమహిళలతో కర్నూలులో నాగబాబు సమావేశమయ్యారు. వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ అవుతుందని విమర్శించారు. వైసీపీ ఒక పార్టీయేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో జనసేన బలంగా ఉందని, గ్రామస్థాయి నుంచి కేడర్ ను పటిష్ఠం చేయాలని పిలుపునిచ్చారు. పొత్తుల పై త్వరలో ప్రకటన చేయనున్నట్టు నాగబాబు తెలిపారు.

జనసేన, టీడీపీ .. బీజేపీని కలుపుకొని పోవాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకే పొత్తుల ప్రకటన ఆలస్యం చేస్తున్నాయి. విపక్షాలను ఏకతాటి పైకి తీసుకురావాలనేది జనసేనాని లక్ష్యం. తద్వార ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వకూడదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తుల పై వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు రాని పక్షంలో.. టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.