KCR khammam Meeting: “దేశంలో మత పిచ్చి లేపుతున్నారు.. అభివృద్ధి చేయడం లేదు.. వనరులు ఉన్నా వినియోగించుకోవడం చేతకావట్లేదు. అందుకే దేశానికి ఒక గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు నేను భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తున్నాను.” మొన్న ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా కెసిఆర్ చెప్పిన మాటలు ఇవి.. కానీ ఇవాళ ఖమ్మంలో నిర్వహించిన ఆవిర్భావ సభలో ఇందుకు పూర్తి విరుద్ధమైన వాతావరణం కనిపించింది.. మరి కొద్ది నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఆర్టీసీలో ప్రతి డిపో నుంచి 40 బస్సులను గ్రామాలకు పంపించారు.. కానీ వారు అనుకున్న స్థాయిలో ప్రజలు తరలి లేదు. ఒకవేళ వచ్చినా కూడా వారు విందు వినోదాలకే పరిమితమయ్యారు.. దీంతో 100 ఎకరాల మైదానంలో సగం ఖాళీగానే కనిపించింది.. పైగా నాలుగు లక్షల మంది వస్తారు అనుకుంటే లక్ష మంది మాత్రమే హాజరయ్యారు.. బయట 50,000 మంది దాకా ఉండి పోయారు. సభకు హాజరయిన జనం లో కూడా సుమారు పాతిక వేలమంది వలంటీర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.. ఆంధ్ర ప్రాంతం నుంచి పదివేల మంది దాకా వచ్చారు.

నాలుగు లక్షల మందితో సభ నిర్వహిస్తామని చెప్పిన భారత రాష్ట్ర సమితి నాయకులు… లక్ష మంది మాత్రమే రావడంతో నాలుక కరుచుకున్నారు. సమావేశ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేయకపోవడంతో వచ్చిన ప్రజలు ఎండకు ఇబ్బంది పడ్డారు.. కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంతో నరకం చూశారు. కొంత మంది ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఇక ఎమ్మెల్యేలు కూడా కిందకే పరిమితం అయ్యారు.. ఎవరికీ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కేరళ సీఎం నాలుగు ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడి వెళ్ళిపోయారు. కేసీఆర్ ప్రసంగం కూడా శుచి, రుచి లేని వంటకాన్ని తలపించింది. ఇక తమ్మినేని, భగవంత్, అరవింద్, రాజా గురించి ఎంత తక్కువ చెప్పుకుటే అంత మంచింది.

ఈ సభ ద్వారా దేశానికి దిశ దశ చూపిస్తామని కెసిఆర్ ప్రకటించినప్పటికీ… ఆ దిశగా ఎటువంటి మాటలు మాట్లాటడలేదు. కనీసం ఏం చేస్తామనే హామీ కూడా ఇవ్వలేదు. ఏపీ వాసుల ప్రేమ చూరగొనేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. పలు సందర్భాల్లో మోడీ మీద విరుచుకు పడిన కేసీఆర్… బహిరంగ సభలో ఎందుకో తడ బడ్డారు. మోడీని వ్యతిరేకిస్తున్న వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్న కేసీఆర్ సార్…ఎందుకో ఖమ్మం సభలో పస తగ్గింది. కమాన్ కేసీఆర్ సార్… మీరు ఫైటర్ అని చెప్పుకుంటారు కాబట్టి…ఈసారి పొరుగున ఉన్న మహా రాష్ట్ర లోనో, కర్ణాటక లోనో సభ పెట్టండి…ఈసారి మోడీని మరింత తిట్టండి. గుణాత్మకంగా దుయ్యపట్టండి. చెప్పేందుకు ఇబ్బంది గా ఉన్నా ఆవిర్భావ సభ మాత్రం ప్లాప్.. బెటర్ లక్ నెక్స్ట్ టైం.