KCR BRS: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేస్తాం. సైన్యంలో పాత పద్ధతిలో నియామకాలు చేపడతాం. భారత్ ను ప్రపంచానికి ఫుడ్ చైన్ గా మారుస్తాం. ఎల్ఐసీకి అండగా ఉంటాం. దేశం మార్పు కోరుతోంది. ఇంతసేపు కూర్చున్న మీ సహనమే అందుకు నిదర్శనం. బీఆర్ఎస్ లక్ష్యం ఇదే. వెలుగు జిలుగుల భారత్ సాధనే బీఆర్ఎస్ లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. దేశంలో గుణాత్మక మార్పుకు బీఆర్ఎస్ పని చేస్తుందని స్పష్టం చేశారు.

ఖమ్మం సభ వేదికగా కేసీఆర్ బీఆర్ఎస్ లక్ష్యాలను వెల్లడించారు. బీజేపీ విధానాలను దుయ్యబట్టారు. కేసీఆర్ మాటలతో సభికుల్ని ఉర్రూతలూగించారు. వినూత్నమైన హామీలతో బీజేపీకి షాక్ ఇచ్చే నిర్ణయాలు ప్రకటించారు. ఖమ్మం చరిత్రలో ఇలాంటి సభ ఎన్నడూ జరగలేదని కేసీఆర్ తెలిపారు. 150 మంది మేధావులతో బీఆర్ఎస్ విధివిధానాల్ని రూపొందిస్తోందని కేసీఆర్ వెల్లడించారు.
ప్రపంచానికి ఫుడ్ చైన్ గా మారాల్సిన దేశం.. పిజ్జాలు, బర్గర్లు తింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని నీటి వనరులు, విశాలమైన వ్యవసాయ భూమిని ఉపయోగించి బ్రహ్మాండమైన పంటలు పండించవచ్చన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను అభివృద్ధి చేసి ప్రపంచానికే ఫుడ్ చైన్ గా మార్చుతామని వెల్లడించారు. దేశంలో ఉన్న 70 వేల టీఎంసీల నీటిని వినియోగించుకుని, రాష్ట్రాల మధ్య జలవివాదాలు లేకుండా చేస్తామన్నారు. చైనాలో యాంగ్జీ నది పై 5 వేల టీఎంసీల ప్రాజెక్టు ఉందని, అలాంటి ప్రాజెక్టు భారత్ లో నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ లోని విశాలమైన భూభాగాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.

మిగులు విద్యుత్ తో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. తద్వార దేశంలో రైతుల ఆత్మహత్యలు నివారిస్తామని వెల్లడించారు. ఉచిత విద్యుత్ ఇస్తే కేవలం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని, మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు రూ. 14 లక్షల కోట్లు ఎన్పీఏల పేరుతో దోచిపెట్టిందన్నారు. నష్టాలు సమాజానికి, లాభాలు ప్రైవేటు వ్యక్తులకు అన్న పాలసీతో మోదీ ప్రభుత్వం నడుస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసీ అమ్మకాన్ని అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు బీఆర్ఎస్ తో కలిసి రావాలని, పిడికిలి బిగించి పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
వ్యాపారాల నుంచి మోదీ ప్రభుత్వం దూరం జరిగితే.. అవసరం మేరకు వ్యాపారం చేయడం తమ విధానమని కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వానికి వచ్చే లాభాలతో పేదలకు సబ్సీడీకే అన్ని వసతులు కల్పించవచ్చని వెల్లడించారు. అగ్నిపథ్ స్థానంలో పాత పద్ధతిలో నియామకాలు చేపడతామని వెల్లడించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రద్దు చేస్తామని చెప్పారు. మోదీ అమ్మితే.. అధికారంలోకి వచ్చాక తాము కొంటామని హామీ ఇచ్చారు. దేశంలో మేడిన్ ఇండియా .. జోక్ ఇన్ ఇండియాగా మారిందని ఎద్దేవా చేశారు.
బీజేపీ టార్గెట్ గా ఖమ్మం సభలో కేసీఆర్ ప్రసంగం సాగింది. మోదీ విధానాలను దుయ్యబడుతూనే.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కేసీఆర్ వెల్లడించారు. త్వరలో పూర్తీ స్థాయి విధివిధానాల్ని ప్రకటిస్తామని తెలిపారు. మోదీది ప్రైవేటైజేషన్ అయితే తమది నేషనలైజేషన్ అంటూ బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని స్పష్టంగా కేసీఆర్ చెప్పారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందని కేసీఆర్ చెప్పకనే చెప్పారు. దేశంలో అధిక భాగం రైతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతు అజెండాను తీసుకోవడం ద్వార బీఆర్ఎస్ వీలైనంత త్వరగా ప్రజల్లోకి వెళ్లొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ లక్ష్యాలు ఒక విధంగా బీజేపీకి షాక్ ఇస్తాయని చెప్పుకోవచ్చు. మోదీ ప్రభుత్వం విఫలమైన విషయాలనే కేసీఆర్ టార్గెట్ చేసుకున్నారు. ఇది కేసీఆర్ రాజకీయ వ్యూహాన్ని స్పష్టం చేస్తుందని చెప్పవచ్చు.