Kavali
Kavali: అప్పుడెప్పుడో వచ్చిన ‘ఏమండోయ్ ఆవిడ వచ్చింది’ సినిమాలో బాబు మోహన్ కు( cinema actor Babu Mohan ) గాడిదతో పెళ్లి చేయిస్తాడు బ్రహ్మానందం. పురోహితుడు పాత్రలో ఉండే బ్రహ్మానందం.. బాబు మోహన్ కు పెళ్లి దోషం ఉండడంతో గాడిదతో పెళ్లి చేయించి.. ఆ దోష నివారణ చేస్తాడు. ఇప్పుడు ఏపీలోని నెల్లూరు జిల్లాలో అయితే ఇటువంటి తతంగం ఒకటి బయటపడింది. కొంతమంది పురోహితులు పెళ్లి కాని వారిని చెట్లతో పెళ్లి చేయించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కావలితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లతో పెళ్లి చేయించడం ద్వారా అవి వివాహితులకు పెళ్లిళ్లు అవుతాయని కొంతమంది పురోహితులు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇదొక ప్రచారంగా మారిపోయింది.
* వీడియోలు చూపి.. ఆకర్షించి
ప్రధానంగా కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్( Kavali 2 Town Police Station ) పరిధిలోని వెంగళరావు నగర్ వీరబ్రహ్మేంద్రస్వామి గుడి దగ్గర కొందరు పురోహితులు హల్చల్ చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ల వివాహం ముందు తొలుత రావి, తరువాత అరటి చెట్లతో వివాహం జరిపించారంటూ కొన్ని వీడియోలు చూపిస్తున్నారు. తమ మాటలతో పెళ్లి కానీ యువకులను ఆకర్షిస్తున్నారు. చెట్లతో పెళ్లి చేసుకుంటే మంచిదని చెప్పి.. వారి నుంచి 20 వేల రూపాయలకు తగ్గకుండా వసూలు చేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు దృష్టి పెట్టారు.
* పోలీసుల విచారణ
ముందుగా పురుషులకు( mens ) అరటి చెట్టుతో.. మహిళలకు రావి చెట్టుతో పూజలు చేయించి.. పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. అనంతరం ఆ చెట్టు, మొక్కలను సముద్ర తీరానికి తీసుకెళ్లి నరికి వేయిస్తున్నారు. ఆ తర్వాత జరిగే పెళ్లితో అరిష్టాలన్నీ తొలగిపోతాయని పురోహితులు నమ్మబలుకుతున్నారు. అయితే ఇటీవల ఇటువంటి వివాహాలు పెరగడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి పురోహితులను పోలీస్ స్టేషన్ కు రప్పించారు. వారి నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మొత్తానికి అయితే పెళ్ళికాని ప్రసాద్ ల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు పురోహితులు.