Karthika Deepam Last Episode: కార్తీకదీపం ముగిసింది.. ఆ చివరి ఎపిసోడ్ చూసే సమయంలో ఇబ్బంది పెట్టడని ఓ షాప్ యజమాని తన దగ్గరికి వచ్చే కస్టమర్ చెయ్యి వేలు కోరికాడు.. అంతలా చొచ్చుకుపోయింది మరీ… ఎన్ని సీరియల్స్ వచ్చినా తన రేటింగ్స్ తనవే. సుదీర్ఘ కాలం పాటు ప్రసారమై మొత్తానికి మొన్న ముగిసింది.. కానీ చివరి రోజు వంటలక్క, డాక్టర్ బాబు రేటింగ్స్ ను దున్నేశారు. అది కూడా ఒక రేంజ్ లో.. రకరకాల కథనాలు, రూమర్స్ ఉన్నప్పటికీ.. ఇన్నేళ్లు ఆదరించి, మధ్యలో వదిలేసిన వాళ్ళు సైతం చివరి ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు.

15.42 ఇదీ ఎపిసోడ్ కు రేటింగ్స్.. మీ హైదరాబాద్ బార్క్ రేటింగ్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపితే 18 వరకు ఉండొచ్చు.. ఈ రోజుల్లో ఇది సూపర్ హిట్ అన్నమాట.. అలా ప్రేక్షకులు తమకి ఇష్టమైన వంటలక్కకు వీడ్కోలు పలికారు. నిజానికి ఈ సీరియల్ ప్రేమి విశ్వనాథ్ దే. ఆమె లేకపోతే సీరియల్ లేదు, అంతగా జనాన్ని కట్టిపడేసింది..
ఆమె అందగత్తా అంటే కాదు.. చామన చాయ కలర్.. కాస్త ముదురు మొహం.. నో ఎక్స్ పోజింగ్.. మాటలో వెగటు తనాన్ని కొంచెం కూడా చూపించదు.. తెలుగు రాదు.. ముందు ఏమైనా సీరియల్స్ చేసిందా అంటే లేదు.. పోనీ కార్తీకదీపం వస్తున్నప్పుడు మరో సీరియల్ లో నటించిందా అంటే అదీ లేదు.. టీవీ షోలు, ఇంటర్వ్యూ లతో పాపులారిటీని పెంచుకునే ప్రయాస ఉందా అంటే అది కూడా లేదు. ఇవేవీ లేకుండానే తెలుగు నాట ప్రతి ఇంటికి ఆడపడుచు అయిపోయింది.. ఆమెను గుర్తు పట్టని వాళ్ళు లేరు.. బోలెడు మంది సినిమా తారలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్లందరి కన్నా ప్రేమీ బాగా జనానికి కనెక్ట్ అయిందంటే అతిశయోక్తి కాదు.. కాకపోతే ఆ దర్శకుడు ఎవరో సీరియల్ ను కాస్త సాగదీయాలనే కక్కుర్తి తో, తలతిక్క ట్విస్టులు పెట్టి సీరియల్, ప్రేమి ఇమేజ్ దారుణంగా దెబ్బతీశాడు. మధ్యలో ఆమెను మాయం చేసి కథ నడిపించాలి అనుకున్నాడు.. కానీ ఆమె లేకపోతే సీరియల్ లేదనే విషయాన్ని లేటుగా గుర్తించాడు.. పడిన సీరియల్ రేటింగ్స్ మళ్లీ లేవలేదు. స్టార్ మా టీవీ కదా పంప్ బాగానే కొట్టింది.. అయినా రేటింగ్స్ పెద్దగా పెరగలేదు.. పలుసార్లు ఆ సీరియల్ ను వేరే సీరియళ్ళు దాటిపోయాయి. దాంతో బుద్ధి తెచ్చుకున్న దర్శకుడు, నిర్మాత ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారు.. అలా ఫైనల్ ఎపిసోడ్ పడింది.. వంటలక్క వెళ్లిపోయింది.

ఎవరు ఏం రాసుకున్నా సరే కార్తీకదీపం రేటింగ్స్ చరిత్ర బహుశా మరొక సీరియల్ కు రాదు.. దాని ఫినిషింగ్ టచ్ కూడా అదిరిపోయింది.. టీవీల వీక్షణం దారుణంగా తగ్గిపోతున్న ఈ రోజుల్లో… ఆల్రెడీ భ్రష్టు పట్టించిన సీరియల్ చివరి భాగానికి ఈ రేటింగ్స్ రావడం ఒక రకంగా గ్రేటే. బంపర్ హిట్ సినిమా కాంతారకు పదిలోపు రేటింగ్స్ వస్తే.. కార్తీకదీపానికి 15 వచ్చాయి.. అదీ వంటలక్క సత్తా. ఏ మాటకు ఆ మాట విలన్ గా చేసిన శోభా శెట్టి, హీరోగా చేసిన నిరూపమ్ ఈ సీరియల్ కు అదనపు బలాలు. ప్రత్యేకించి శోభ శెట్టికి ఇలాంటి పాత్ర దక్కకపోవచ్చు.. ఆ ఇద్దరు పిల్లలు సరే సరి.. ఏది అయితేనేం తెలుగు ప్రేక్షకులు వంటలక్క కు ఘనంగా వీడ్కోలు పలికారు.