
Karnataka Assembly Election: దక్షిణాదిలో ఎన్నికలకు ఈసీ తెరతీసింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఢిల్లీలో విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. మే 24తో కర్నాటక అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. దీంతో ఇక్కడ ఎన్నికలు అనివార్యంగా మారాయి. కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్న సీఈసీ ప్రకటించారు. ఒకే విడతలో ఎన్నికలు పూర్తిచేయనున్నట్టు తెలిపారు. మే 10న పోలింగ్, 13న కౌంటింగ్ తో పాటు ఫలితాలను వెల్లడించనున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 13న నోటిఫికేషన్ వెల్లడిస్తామని.. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అయితే ఇప్పటికే ఎన్నికలకు ప్రధాన రాజకీయ పక్షాలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ కు పట్టున్న రాష్ట్రాల్లో కర్నాటక కూడా ఒకటి. దీంతో ఇక్కడ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
ఓట్ ఫ్రం హోం..
ఎలక్షన్ కమిషన్ చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేస్తోంది. 80 సంవత్సరాలు దాటిన వారితో పాటు దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు హక్కు కల్పిస్తోంది. భవిష్యత్ లో ఆన్ లైన్ ఓటింగ్ కు ప్రయోగత్మకంగా తీసుకోవాలని భావిస్తోంది. మొత్తం 224 నియోజకవర్గాలకుగాను 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 58,282 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా 1320 పోలింగ్ కేంద్రాలను కేటాయించామన్నారు. 41,312 ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు సీఈసీ ప్రకటించారు. 80 సంవత్సరాలు పైబడిన వారు 12.15 లక్షల మంది ఉండగా.. వీరందరికీ ఇంటి నుంచే ఓటు వేసే విధంగా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దివ్యాంగులకు సైతం ఆన్ లైన్ లో ఓటు వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇక ఉచితాలపై రాజకీయ పార్టీలకు ఈసీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.

బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి ఫైట్…
దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటక కీలకం. మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ జాతీయ పార్టీల హవా నడుస్తోంది. జేడీఎస్ వంటి ప్రాంతీయ పార్టీ ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది కర్నాటకలోనే. అటు కాంగ్రెస్ పార్టీకి సైతం క్షేత్రస్థాయిలో బలం ఎక్కువ. జాతీయ అధ్యక్షుడు మల్లఖార్జున కార్గే సొంత రాష్ట్రం కూడా. మొన్నటికి మొన్న రాహుల్ జోడో యాత్ర కర్నాటకలో సక్సెస్ ఫుల్ గా నడిచింది. ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ దేనని పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. అందుకే ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించారు. 224 స్థానాలకుగాను 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. బీజేపీ మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తానికి నడి వేసవిలో కర్నాటక ఎన్నికలు దక్షిణాది రాష్ట్రాల్లో హీట్ పెంచనున్నాయి.