
Kanna Lakshminarayana: ఇటీవలే బీజేపీకి గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా జనసేనలో చేరతాడని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా టీడీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా నిన్న కన్నాను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి అంగీకరించిన కన్నా.. ఈమేరకు గురువారం ముహూర్తం కూడా పెట్టుకుని ప్రకటన చేశారు.
బాబు సమక్షంలో చేరిక..
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో గురువారం టీడీపీ ప్రాంతీయ సమావేశం ఉంది. ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పచ్చ కండువా కప్పుకోనున్నారు. తనతో పాటు చాలా మంది నేతలు టీడీపీలో చేరతారని కన్నా తెలిపారు.
జగన్ సర్కార్‌పై విమర్శల దాడి…
బీజేపీలో ఉన్న సమయంలో యాక్టివ్‌గా లేని కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడిన తర్వాత కాస్త యాక్టివ్ అయ్యారు. మరోవైపు టీడీపీ కండువా కప్పుకోకముందే జగన్ సర్కార్‌పై విమర్శల దాడి షురూ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయం దహనాన్ని ఖండించారు. ఈ వ్యవహారంపై వైసీపీ సర్కార్ తీరుపై కన్నా విమర్శలు చేశారు.

ఫ్యాక్షన్ సంస్కృతితో పోల్చిన కన్నా..
గన్నవరం టీడీపీ ఆఫీసు దహనం ఘటనను వైసీపీ ఫ్యాక్షన్ పాలనకు నిదర్శనమని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాష్ట్రంలో పులివెందుల సంస్కృతిని తీసుకొచ్చారని, ఫ్యాక్షన్∙సంస్కృతిని సీఎం జగన్ పెంచి పోషిస్తున్నారని కన్నా ఆరోపించారు. గన్నవరం టీడీపీ ఆఫీసు దహనాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ నేత పట్టాభి విషయంలో డీజీపీ వైఖరి సరికాదని తెలిపారు. మొత్తంగా టీడీపీలో చేరకముందే కన్నా వైసీపీ సర్కార్‌పై విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కన్నా చేరికతో ఎవరి నష్టం.. ఎవరికి లాభం అన్న చర్చ కూడా మొదలైంది.
