Journalism: జర్నలిజం అంటే.. న్యూట్రాలిటీకి అసలు సిసలైన అర్థం. తెగింపు ఉంటుంది కాబట్టి, దమ్ము ఉంటుంది కాబట్టి.. 100 కత్తుల కన్నా.. ఒక కలానికే నేను భయపడతానని ప్రపంచాన్ని నియంతలా పాలించిన అడాల్ఫ్ హిట్లర్ అన్నారు. అంతటి ఎమర్జెన్సీ కాలంలోనూ ఇందిరా గాంధీ కేవలం పాత్రికేయులకు మాత్రమే భయపడింది. ఇప్పుడంటే పాత్రికేయం ఒక అంగడి సరుకయ్యింది. డప్పు కొట్టేందుకు మాత్రమే పనికొచ్చే ఒక డోలు అయింది. కానీ వెనుకటి రోజుల్లో అలా కాదు. ఓ గోల్కొండ పత్రిక స్వాతంత్ర్య కాంక్షను జనాల్లో రగిలించింది. ఇంకా తెలుగు నాట చాలా పత్రికలు రకరకాల ఉద్యమాలకు బీజం పోశాయి. పాత్రికేయాన్ని నర నరాన జీర్ణించుకున్న వ్యక్తులు కొత్త విలువలకు శ్రీకారం చుట్టారు. అందుకే ప్రభుత్వాలు పత్రికలకు, పాత్రికేయులకు భయపడ్డాయి. అక్కడి దాకా ఎందుకు ఇరాన్, ఇరాక్ తో యుద్ధాల్లో అమెరికా అకృత్యాలను బయటకు తీసుకొచ్చింది పాత్రికేయలే. ఆ తర్వాతే అమెరికా సేనలు మెల్ల మెల్లగా ఇంటిదారి పట్టాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పాత్రికేయానికి సరికొత్త అర్ధాన్ని చెప్పిన పాత్రికేయులు ఎంతోమంది.

డప్పు కొడుతున్నారు
ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్ యుగం కాబట్టి.. న్యూస్ ఛానళ్ళ హవా నడుస్తోంది. కానీ మొదట్లో బాగానే ఉండేది. రాను రాను పరిస్థితి మొత్తం మారిపోయింది. విషయం కంటే వాగుడు ఎక్కువైంది. న్యూస్ ఆధారంగా జరగాల్సిన చర్చ న్యూసెన్స్ అయిపోతున్నది. దీంతో న్యూస్ చానల్స్ కాస్త పొలిటికల్ మౌత్ పీసులు అయిపోతున్నాయి. వార్తాపత్రికల మాదిరే వీటిని కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేకుండా పోతోంది. టిఆర్పి మాయలో పడి విలువలకు తిలోదకాలు పాత్రికేయులు ఎక్కువైపోయారు. వారికి తోడు యాజమాన్యాలు ఉండడంతో విలువలు గంగలో కలిసిపోతున్నాయి. అత్యాచారానికి గురైన బాధితురాలి పేరు ప్రస్తావించకూడదనే కనీస స్పృహ పాత్రికేయులకు లేకుండా పోవడం దురదృష్టకరం.
రాజకీయ నాయకులను మించిపోతున్నారు
ముందే చెప్పుకున్నట్టు ఆయా రాజకీయ పార్టీలకు మౌత్ పీస్ లు ఉండడంతో… అందులో పని చేసే పాత్రికేయులు కూడా ఆ రంగు పూసుకుంటున్నారు. ఒక స్థాయి పోస్టుల్లో ఉన్న కీలక ఉద్యోగులు రాజకీయ నాయకులను మించి సోషల్ మీడియాలో సోది పోస్టులు పెడుతున్నారు. దీనివల్ల జనాల్లో ఒక రకమైన అభిప్రాయం కలుగుతున్నది. పైగా వారు చెప్పే విషయాలను నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది. విచక్షణ అనేది కోల్పోయి రాజకీయ నాయకుల మాదిరి పోస్టులు పెడుతుండడం పతనమవుతున్న విలువలకు నిదర్శనంగా కనిపిస్తోంది.

ఆ స్థాయి ఎవరికి ఉంది
ఎన్డిటివిని అదాని టేక్ ఓవర్ చేసిన తర్వాత… అందులో న్యూస్ ఎడిటర్ పోస్ట్ ఖాళీ అయింది. ఎవరిని పెట్టాలనే సంశయం గౌతమ్ అదానీకి తలెత్తినప్పుడు వెంటనే స్ఫురించిన పేరు పాల్కి శర్మ… ఈమె మరెవరో కాదు జీటీవీలో ఒక న్యూస్ ప్రజెంటర్. ఛానల్ బిజెపి మాజీ ఎంపీ. బిజెపి వేవ్ లెంత్ లో ప్రసారాలు ఉన్నప్పటికీ శర్మ ఎప్పటికీ తన లైన్ దాటి పోలేదు. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పింది. అదే సమయంలో తన న్యూట్రాలిటీ ని ఎక్కడా కోల్పోలేదు. అదే ఇప్పుడు గౌతమ్ అదాని కంట్లో పడేలా చేసింది. ఇలాంటి జర్నలిస్టులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? వాగాడంబరం తప్ప విషయం ఉన్న వారు ఎంతమంది? ప్రైవేట్ యాజమాన్యాల కింద పనిచేస్తున్నప్పుడు వారి లైన్ లోనే ట్యూన్ కావాలి. కానీ బజారులో పోతురాజు మాదిరి కొట్టుకోకూడదు. ప్రస్తుతం చాలామంది పాత్రికేయులు చేస్తున్నది అదే. ఒక రాజకీయ పార్టీకి బాకా ఊదడం… సోషల్ మీడియాలో సోది పోస్టులు పెట్టడం.. ఇలాంటి వారు ఉన్న తర్వాత ఇక పాత్రికేయానికి మంచి రోజులు ఎక్కడ వస్తాయి? ఎలా వస్తాయి?