Human Dog: పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు పెద్దలు. వీటిని అమల్లో పెట్టేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంటారు. ఇవి కొన్ని సార్లు నవ్వుతెప్పిస్తాయి. మరికొన్ని సార్లు ఇదేం వెర్రి రా బాబూ అనేలా చేస్తాయి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. మీరు చదవబోయే వ్యక్తి తాలూకూ కథ అలాంటిది మరి. అది చదివిన తర్వాత ఇదేం శునకానందం అని కచ్చితంగా అనుకుంటారు.
అనగనగా జపాన్ దేశంలో టోకో అనే వ్యక్తి ఉన్నాడు. ఇతగాడికి జంతువులంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం రోజురోజుకు పెరిగిపోయింది. ఫలితంగా తను జంతువులాగా మారితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అతడు కుక్కలాగా మారేలా చేసింది. ఇందుకు సంబంధించి అతడు చేసిన ప్రయత్నాలు మామూలువికావు. సాధారణంగా ఒక మనిషి కుక్కలాగా మారడం అంటే మామూలు విషయం. కాకపోతే ఇక్కడ టోకో ఎంచుకున్న విధానం పూర్తి విభిన్నమైనది. తను కుక్కలాగా కనిపించేందుకు “హైపర్ రియలిస్టిక్ కాస్ట్యూమ్” కొనుగోలు చేశాడు. ఈ వస్త్రాన్ని “జెప్పెట్” అనే కంపెనీ తయారుచేసింది. ఆ వస్త్రంతో కోలిస్ రకానికి చెందిన కుక్కలాంటి ఆకృతిని రూపొందించింది. దీనికోసం అది 40 రోజుల టైం తీసుకుంది. కోలిస్ అనే రకానికి చెందిన కుక్కలు మధ్యతరహాగా ఉంటాయి. టోకో రూపం ఆధారంగా జెప్పెట్ కంపెనీ ఈ ఆకృతిని రూపొందించింది. జెప్పెట్ కంపెనీ రూపొందించిన కుక్క రూపం లాంటి వస్త్రాన్ని టోకో ధరించాడు. పచ్చిక బయల్లో నడవడం ప్రారంభించాడు. మొదట్లో కుక్కలాగా నడిచేందుకు అతడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఇతర కుక్కలు ఆ కోలి రూపాన్ని ఆశ్చర్యంగా చూసేవి. ఆ కోలి రూపాన్ని ధరించినప్పుడు.. కుక్కలాగా నడవలేక టోకో ఇబ్బంది పడి.. ఒకచోట కుదురుగా ఉండేవాడు. వీటిని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు.
ఆ వీడియోలు ఇప్పటివరకు మూడు మిలియన్ల వ్యూస్ సాధించాయి. “నాకు చిన్నప్పటినుంచి జంతువులంటే చాలా ఇష్టం. జంతువులా మారితే ఎలా ఉంటుందోనన్న ఒక ఆసక్తి నన్ను వెంటాడుతూ ఉండేది. అదే నన్ను ఇలా మారేలా చేసింది. మనుషులకు, జంతువులకు వ్యత్యాసం ఉంటుంది..అదే నన్ను కోలిగా మార్చేలా చేసింది” అని టోకో రాసుకొచ్చాడు. కాగా, టోకో వీడియోలను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ రూపం బాగుందని కితాబు ఇస్తుండగా.. మరి కొందరు ఇది పనికిమాలిన చర్య, గగుర్పాటు కలిగించేదని కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు శునకానందం అనే సామెతను పెద్దలు విరివిగా వాడేవారు. ఇప్పుడు టోకో దానిని నిజం చేసి చూపించాడు. అన్నట్టు ఈ శునకానందం ఖర్చు మన కరెన్సీలో 12 లక్షలు. అమెరికా కరెన్సీలో అయితే 14వేల డాలర్లు.