
Jagan- KCR: ఏపీ సీఎం జగన్ లో కళ తగ్గిందా? మునుపటిలా ఆయన కనిపించడం లేదు ఎందుకు? వరుస పరిణామాలతోనే ఆయనలో స్పష్టమైన మార్పు వచ్చిందా? తొలి మూడున్నరేళ్లు కనిపించినంత ధీమా ఎందుకు ఇప్పుడు కనిపించడం లేదు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పటివరకూ సానుకూలంగా ఉన్న అంశాలు ప్రతికూలతగా మారడంతోనే జగన్ లో మార్పు కారణమా? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ సన్నిహితంగా ఉంటున్న కేసీఆర్ వ్యూహాత్మంగా అడ్డం తిరగడంపై కూడా అంతర్మథనం చెందుతున్నారు. తీవ్ర ప్రజావ్యతిరేకత ఉన్న సమయంలో తెలంగాణ మంత్రులు దానిని మరింత రెట్టింపు చేసేలా కామెంట్స్ చేస్తుండడంతో కలత చెందుతున్నట్టు తెలుస్తోంది.
ప్రతికూలాంశాలతో…
నాలుగేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేకత ఒక వైపు, పార్టీలో కట్టుదాటతున్న క్రమశిక్షణ మరోవైపు జగన్ మునపటిలా నిద్రపట్టనివ్వడం లేదు. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, కోడికత్తి కేసు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ.. ఇలా ఒకదాని తరువాత ఒకటి వెంటాడుతునే ఉంది. వైఎస్ జగన్ ఎక్కడ బహిరంగ సభలకు వెళ్లినా.. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభానికి వెళ్లినా చిరునవ్వుతో సభకు వచ్చిన ప్రజలు, కార్యకర్తలను పలకరిస్తూ ఉంటారు. ఆ నవ్వు, ప్రతిపక్షాలపై సెటైర్లు, కౌంటర్లు గట్టిగా ఇచ్చేవారని కార్యకర్తలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య జరిగిన సమావేశాల్లో జగన్ ముఖం కళ చెదిరినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు.. ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్లిచ్చినట్లుగా కూడా పెద్దగా ఎక్కడా కనిపించలేదు.
స్టీల్ ప్లాంట్ ఇష్యూతో,,,
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కుగా… 32 మంది ఆత్మ బలిదానాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. బలమైన సెంటిమెంట్ ను సొంతం చేసుకుంది. కానీ దాని ప్రైవేటీకరణలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను జగన్ అడ్డుకోలేకపోయారన్న అపవాదు ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం.. ఈ మధ్య ఏకంగా బిడ్‌లకు కూడా ఆహ్వానించడంతో ఒక్కపరిస్థితులు మారిపోయాయి. ప్రైవేటీకరణను ఆపుతామని బిడ్ వేసి స్టీల్‌ప్లాంట్ దక్కించుకోవాలని కేసీఆర్ సర్కార్ రంగంలోకి దిగింది. దీనికి ముందే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పెద్ద ఎత్తునే మాటల తూటాలు పేలాయి. ఎంతలా అంటే తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేంతలా.. అంతకుమించి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునేదాకా పరిస్థితులు వెళ్లాయి. దీంతో అప్పటి వరకూ కలిసి మెలిసున్నాయనకున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కాస్త ఉప్పు-నిప్పులా మారిపోయాయి.

ఏదో ఒక వైపు వెళ్లాలిక..
అయితే ఇప్పుడు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి అన్నట్టుంది జగన్ పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ముందుకు అడుగువేస్తే బీజేపీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. వెనుకడుగు వేస్తే కేసీఆర్ సాన్నిహిత్యం దూరమవుతుంది. ఇప్పటి వరకూ బీజేపీ, బీఆర్ఎస్ ను జగన్ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏదో ఒక్కరు మాత్రమే తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ తో ఘర్షణ వైఖరి వద్దని పార్టీ మంత్రులకు సీఎం అల్టిమేట్ జారీచేసినట్టు తెలిసింది. మంత్రి అప్పలరాజుకు సీఎం కార్యాయలం తలంటినట్టు లీకులిచ్చారు. అది కేసీఆర్ ను కూల్ చేయడానికేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఏపీ సీఎం గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఒక విధంగా భయపడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.