
YSR Law Nestham Scheme: పేరుగొప్ప.. ఊరు దిబ్బలా ఉంది జగన్ సర్కార్ పరిస్థితి. చేసేది అప్పులైనా.. ప్రచారానికి అందిస్తున్న నిధులకు, నాలుగురెట్లు ప్రచారం చేసుకుంటుంది. ప్రతిపక్షాలు విమర్శించినా… ఐ డోంట్ కేర్ అంటూ జనాన్ని అప్పుల ఊబిలో లాక్కెళ్తుంది. తాజాగా లా నేస్తం పథకం విడుదల చేసిన జగన్ ప్రభుత్వం, ప్రచారానికి మాత్రం రూ.4 కోట్ల వరకు తగలేసిన ఈ పథకం అమలుపై అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం లా నేస్తం నిధులను విడుదల చేసింది. బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో వైఎస్ జగన్ ‘బటన్’ నొక్కి జూనియర్ లాయర్ల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మూడేళ్ల అదిగో ఇదిగో అంటూ కొత్తగా వృత్తిలోకి వచ్చిన లాయర్లు ఊరట లభించింది. ఇందుకోసం మొత్తం కేటాయించింది రూ.1 కోటి మాత్రమే. అయితే, ఇందు కోసం ప్రభుత్వం చేసుకున్న ప్రచారం ఆ మొత్తానికి ఐదు రెట్లు ఎక్కువ.
దుబారా ఖర్చు ఎక్కువ
అధికారంలోని జగన్ సర్కార్ దుబారాగా ఖర్చు చేసేందుకు మాత్రం ఏ మాత్రం వెనుకాడటం లేదు. ప్రభుత్వం ప్రరాభం నుంచి ఈ రకమైన ఖర్చు పథకాలకు కేటాయించిన దానికంటే కాస్త ఎక్కువగానే ఉందనడంలో సందేహం లేదు. దీనిపై ప్రతిపక్షాలు కూడా గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, గ్రామాల్లోని వాటర్ ట్యాంకులకు చివరకు శ్మశానాలకు కూడా వైసీపీ మూడు రంగులు వేయడానికి కోట్ల రూపాయలను అనవసరంగా తగలేసిన ప్రభుత్వం, ఆ తరువాత కూడా చేస్తూనే ఉంది. కోర్టులు చివాట్లు పెట్టినా మానడం లేదు.
లా నేస్తానికి ప్రచార ఖర్చు రూ.5కోట్లపైమాటే..
బుధవారం విడుదల చేసిన లా నేస్తం పథక ప్రచారానికి ప్రభుత్వం రూ.5కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఈనాడు దిన పత్రికలో ప్రదాన పేజీలో హాఫ్ పేజీకి దగ్గరగా యాడ్ ఇచ్చారు. దీని విలువ సుమారు కోటిన్నర పైమాటే ఉంటుంది. అలాగే, స్వంత పత్రిక సాక్షిలో ఫుల్ పేజీ వేసుకున్నారు. దీని విలువ రూ.2 కోట్ల పైనే ఉంటుందని ఆయా పత్రికల యాడ్ టారిఫ్‌ల ఆధారంగా తెలుస్తుంది. ఆ తరువాత డిజిటల్ మీడియా రంగానికి కొంత మేర ప్రకటనలు ఇచ్చారు. ఇదంతా క్రోడీకరించి చూసినట్లయితే లా నేస్తం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుబారా ఖర్చు రూ.5 కోట్ల వరకు ఉంటుంది. కానీ, లా నేస్తానికి విడుదల చేసిన నిధులు రూ.కోటికి కాస్త ఎక్కువ.

ఇదంతా ఎందుకు
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువవుతుంది. సంక్షేమ పథకాల అమలుకు డబ్బుల్లేకపోయినా అప్పోసొప్పో చేసి ఆ వ్యతిరేకతను అనుకూలతగా మార్చుకునేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏటా అనుకున్న నెలల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉంది. అమ్మఒడి నిధులు విడుదలలోనూ జాప్యం జరిగింది. వాహనదారులకు ఇచ్చే వాహనమిత్ర నిధులూ ఆలస్యమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందడం లేదు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ నిధులు ఇంకా జమ కాలేదు. ఫీజు రియంబర్స్‌మెంట్, హాస్టల్ ఫీజులు చెల్లింపు జరగలేదు. కానీ, ప్రచారార్భాటాలకు మాత్రం ప్రభుత్వం వెనుకాడటం లేదు. సంక్షేమ పథకాలకు బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తూ, నేతి బీర కాయ చందంలా డబ్బుకు కొదవలేదని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.