
ISRO: ఇన్నాళ్లు అంతరిక్షంలో చైనా, అమెరికా, రష్యా దేశాలదే ఆధిపత్యం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతుంది. గ్లోబల్ లోనే కాదు గ్లోబ్ పైన ఉన్న ఆకాశంలోనూ ఇండియా లీడర్ గా ఎదుగుతున్నది. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా నింగిలోకి ఉపగ్రహాలను ప్రవేశ పెడుతూ తిరుగులేని రికార్డు సాధిస్తున్నది. రష్యా, అమెరికా, చైనా దేశాలకు అపరిమితమైన ఆర్థిక వనరులు ఉన్నాయి. వాటితో పోల్చితే భారత్ కు చెందిన ఇస్రో కు పరిమిత స్థాయిలోనే ఆర్థిక వనరులు ఉన్నాయి. అయినప్పటికీ అనితర సాధ్యమైన విజయాలను నమోదు చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. వాణిజ్యపరంగానూ మిగతా దేశాలకు దీటుగా నిలుస్తోంది. తాజాగా 36 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతే కాదు అమెరికా లోని నాసా వంటి అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు మన వైపు చూసేలా చేసింది.
ఇస్రోకు సూళ్లూరుపేట పెట్టని కోట. ఈ కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎన్నో ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఇక గగన్ యాన్ మిషన్ కు సరిపోయే ఎల్విఎం 3, ఎం 3 వంటి రాకెట్ ను నింగిలోకి పంపింది. దీని ద్వారా భారీ రాకెట్ ప్రయోగాల్లో తనకు తిరుగు లేదని ప్రపంచానికి నిరూపించింది. వన్ వెబ్ ప్రాజెక్ట్-2 లో భాగంగా ఎల్ వీ ఎం 3_ ఎం 3 రాకెట్ ద్వారా ఇస్రో ఏకంగా 36 ఉపగ్రహాల ప్రయోగాన్ని చేపట్టింది.. దానిని విజయవంతంగా పూర్తి చేసింది. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది.
2014లో ఎల్విఎం3 గతంలో దీనిని జిఎస్ఎల్వీ మాక్ 3 గా పిలిచేవారు. ఈ రాకెట్ ద్వారా 6 ప్రయోగాలు చేపడితే.. అవన్నీ కూడా విజయవంతమయ్యాయి. ఇంగ్లాండ్ లోని వన్ వెబ్ సంస్థకు చెందిన 36 బ్రాడ్ బాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలతో ఎల్వీఎం 3, ఎం 3 రాకెట్ నింగిలోకి తారాజువ్వలాగా దూసుకెళ్లింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా 5,805 కిలోల బరువైన పే లోడ్ తీసుకెళ్లడం ద్వారా ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ రాకెట్ మూడు దశల్లో ప్రయాణించింది. 36 ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులో దిగువ భూ కక్ష్యలోకి చేర్చింది. ప్రయోగం అనంతరం 36 ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ అందుకున్నామని వన్ వెబ్ సంస్థ చెబుతోంది. ఈ సంస్థతో ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ 72 ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి 36 ఉపగ్రహాలను గత ఏడాది అక్టోబర్ 23న ప్రయోగించింది.

ఇక ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోకు వాణిజ్య పరమైన ప్రయోగాలకు మరింత బలం చేకూరిందని ఆ సంస్థ చైర్మన్ చెపుతున్నారు. ఏప్రిల్ చివరి వారంలో మరో వాణిజ్య ప్రయోగం పిఎస్ఎల్వి ద్వారా సింగపూర్ దేశానికి ఉపగ్రహం పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది.. అత్యంత బరువైన ప్రయోగ వాహనం ఎల్వీఎం 3, ఎం 3 గగన్ యా న్ మిషన్ కు సరిపోతుందని ఇస్రో చెబుతోంది. తాజా ప్రయోగంతో శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ వన్ వెబ్ అంతరిక్షంలో తన ఉపగ్రహాల సంఖ్యను 618కి పెంచుకుంది. ఈ ఉపగ్రహాల సహాయంతో ఆ సంస్థ ప్రపంచ నలుమూలల నుంచి బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది.