
MLA Sridevi: ఏపీలో అడుగుపెట్టడానికి భయంగా ఉందని.. దళిత డాక్టర్లైన సుధాకర్, అచ్చెన్నలా తాను ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేనని వైసీపీ బహిష్కరణ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ప్రకటన ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. డాక్టర్ సుధాకర్ వరకూ అందరికి సుపరిచితులే. కానీ డాక్టర్ అచ్చెన్న ఎవరంటూ ఎక్కువ మంది ఆరాతీయడం మొదలుపెట్టారు. శ్రీదేవి మీడియా ముందుకొచ్చిన ముందురోజే డాక్టర్ అచ్చెన్న హత్య జరిగింది. అది సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనే. ఈ హత్య వెనుక కీలక సామాజకవర్గం వ్యక్తి హస్తం ఉందన్న ప్రచారం సాగుతోంది. దీని వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మీడియా ముందుకు వస్తూ వస్తూ.. డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తేనెతుట్టను కదిలించారు. రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ అచ్చెన్న హత్య ఘటన చర్చకు వచ్చే అవకాశం కల్పించారు. అటు దళిత వర్గాల్లోనూ ఆలోచన వచ్చేలా ప్రకటన చేశారు.
చర్యలకు ముందే.. అదృశ్యం
కడప జిల్లాలో పశుసంవర్థక శాఖలో డాక్టర్ అచ్చెన్న డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. వారం రోజుల కిందట ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో ముగ్గురు తోటి ఉద్యోగులతో ఏర్పిడన వివాదంలో ఆయనదే తప్పని చెబుతూ ఆయనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇలా అధికారులు చర్యలకు దిగక ముందే ఆయన కనిపించకుండా పోయారు. రెండు రోజుల కిందటే అదృశ్యమయ్యారు. దీంతో ఆయన కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. ఉన్నతాధికారులు ఇదేమీ పట్టించకుకోకుండా ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. పోనీ పోలీసులు విచారణ జరిపారా? అంటే లేదు. ఏవేవో కారణాలు చెబుతూ పది రోజుల పట్టించుకోలేదు. హఠాత్తుగా డాక్టర్ అచ్చెన్న మృతదేహం బయటపడింది. ఈ నెల 12న కడప జిల్లాలో అదృశ్యమైన అచ్చెన్న 24న అన్నమయ్య జిల్లాలో శవమై కనిపించారు. అయితే ఈ ఘటన వెనుక పశుసంర్థక శాఖ ఏడీలుగా పనిచేస్తున్న శ్రీధర్ లింగారెడ్డి, సుధీర్ నాథ్ బెనర్జీ, సుబాష్ చంద్రబోస్ ల హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు. వారే హత్య చేసినట్టు భావిస్తున్నారు. దీని వెనుక రాజకీయ హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికైతే మరో దళిత అధికారిని బలిగొన్నారు. దీంతో సైలెంట్ గా చంపి బయటకు రాకుండా చేస్తున్నారన్న బలమైన వాదన దళితుల్లో నెలకొని ఉంది.
దళితులే టార్గెట్..
గత ఎన్నికల్లో దళితులు వైసీపీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. వైసీపీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. జగన్ తో దళిత సంక్షేమం సాధ్యమని భావించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత సీన్ మారింది. దళితులకు ప్రత్యేకంగా ఒరిగినదేమీ లేదు. పైగా దాడులు పెరిగాయి. కొవిడ్ సమయంలో వసతులు, ఆరోగ్య భద్రతపై ప్రశ్నించినందున డాక్టర్ సుధాకర్ ను హింసించారు. పిచ్చి అనే ముద్ర వేసి నడిరోడ్డుపై ఆయనపై దాడిచేశారు. ఆయన మానసికంగా కృంగిపోయేలా చేశారు. చనిపోవడానికి కారణమయ్యారు. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్నను అలాగే పొట్టన పెట్టుకున్నారు. పైగా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సరిగ్గా దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బహిష్కరణ సమయంలో ఈ ఘటన జరగడం.. ఆమె మీడియా ముందుకు వచ్చి తాను ఏపీలో రావడానికి భయంగా ఉందని చెప్పడం ద్వారా డాక్టర్ అచ్చెన్న హత్యను హైలెట్ చేసినట్టయ్యింది.

అధికార పార్టీలో కలవరం..
వైసీపీ ఏలుబడిలో దళితులు దగాకు గురయ్యారన్న ప్రచారం ప్రస్తుతం ఊపందుకుంటోంది. దళితులను కట్టడి చేయడానికి అదే దళితులను జగన్ వాడుకుంటుండడం కూడా కూడా ఆ వర్గంలో అసంతృప్తికి కారణమవుతోంది. ఎన్నికల ముంగిట ఈ అంశం తమకు ప్రతికూలంగా మారుతోందని వైసీపీ వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రచారం క్రమేపీ పెరిగితే మాత్రం వైసీపీకి దూరమైన వర్గాల్లో దళితులు చేరిపోతారని విశ్లేషకులు భావిస్తున్నారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న తరహాలో తనను చంపే అవకాశముందని.. తనకు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల నుంచి ప్రాణ హాని ఉందని ప్రకటించడం ద్వారా వైసీపీని ఎమ్మెల్యే శ్రీదేవి డిఫెన్స్ లో పడేశారు. మొత్తానికైతే ఇటీవల వరుస పరిణామాలు దళిత వర్గాల్లో కలవరపాటుకు కారణమవుతుండగా.. అధికార పార్టీకి మాత్రం మింగుడు పడడం లేదు.