Israeli Universities: మనిషి పరిణామ క్రమమే ఒక వైవిధ్యం. కోతి నుంచి రకరకాల మార్పులు చెందుతూ భూమిని శాసించే స్థాయికి మనిషి ఎదగడం అనన్య సామాన్యం.. చార్లెస్ డార్విన్ నుంచి ఇప్పటివరకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ఆ పరిణామ క్రమాన్ని తమకు లభించిన ఆధారాలతో నిరూపితం చేస్తూనే ఉన్నారు.. మనిషి పుట్టుక ఒక అద్భుతమైతే.. పెరగడం, ఆహారం సాధించడం, నివాసం ఏర్పరుచుకోవడం, జీవితం కొనసాగించడం.. ఇవన్నీ కూడా అనేక సవాళ్ళతో కూడుకొని ఉన్నవి. ఇప్పుడంటే మనం రకరకాల ఆహార పదార్థాలు తింటున్నాం. కానీ తొలిసారి మానవుడు ఏం తిన్నాడు? ఎలా తిన్నాడు? ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇజ్రాయిల్ దేశంలో లభ్యమయ్యాయి.

పచ్చిగానే తినేవాడు
ఆదిమానవుడు ఆహారాన్ని వండుకొని కాకుండా పచ్చిగానే తినేవాడని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. పచ్చి మాంసం, ఆకులు, అలమలు కూడా తిన్నట్టు చరిత్ర పుస్తకాల్లో మనం చూసాం. మానవుడు క్రమక్రమంగా పచ్చి ఆహారాన్ని కాకుండా వండుకొని తినడం నేర్చుకున్నాడు. అయితే మానవుడు తొలిసారి ఆహారాన్ని 7,80,000 ఏళ్ల క్రితమే వండుకొని తిన్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇజ్రాయిల్ దేశంలోని గేషర్ బేనోట్ యాకోవ్ ప్రాంతంలో దొరికిన వండిన చేప అవశేషాలపై అధ్యయనం చేయగా ఈ విషయం తెలిసింది.
చాలా అధ్యయనాలు జరిగాయి
తొలిసారి వండిన ఆహారం ఎప్పుడు తిన్నాడన్న దానిపై పలు అధ్యయనాలు జరిగాయి. అయితే ఇప్పటిదాకా దొరికిన ఆధారాలను బట్టి 1,70,000 సంవత్సరాల క్రితం తొలిసారి వండిన ఆహారం తిన్నట్టు వెళ్లడైంది. తాజాగా టెల్ అవీవ్ యూనివర్సిటీ, హెబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం, బార్ ఇలాన్ యూనివర్సిటీలు, స్టీన్ హార్డ్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, ఒరేనమ్ అకడమిక్ కాలేజ్, ఇజ్రాయిల్ ఓషినో గ్రఫిక్ అండ్ లిమ్నోలాజికల్, లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం, మైన్జ్ లోని జోహాన్నేస్ గూటెన్బర్గ్ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధనలో తేలింది.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే
7,80,000 ఏళ్ల క్రితమే మానవులు మంటలను నియంత్రిస్తూ ఆహారం వండినట్లు పరిశోధకులు చెప్తున్నారు. దీంతో ఇప్పటిదాకా వెల్లడయిన అధ్యయనాల ఫలితాలకు తాజా అధ్యయనం తెరదించినట్లయింది. ఈ అధ్యయనానికి టెల్ అవివ్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ ఇరిట్ జోహర్ అనే పరిశోధకుడు నేతృత్వం వహించాడు. అన్ని రకాల పరికరాలు ఉన్న ఈ కాలంలో మంటను నియంత్రించి వంట చేయడం సాధ్యమే. అయితే ఎటువంటి పరికరాలు లేని ఆ రోజుల్లో మంటను నియంత్రిస్తూ ఆది మానవులు వంట చేశారంటే ఆశ్చర్యం కలగక మానదు.. దొరికిన అవశేషాలను బట్టి ఆదిమానవులు తమ ఆహారం కోసం చేపలకు చాలా ప్రాధాన్యం ఇచ్చేవారని అర్థమవుతున్నది. గేషర్ బెనొట్ యాకోవ్ ప్రాంతంలో దొరికిన చేప అవశేషాలను ఒకచోట చేర్చి పరిశీలించగా పురాతన హూలా సరస్సులో ఈ రకం చేపలు ఉన్నట్టు తెలిసింది.

ఎప్పుడో వందల ఏళ్ల క్రితమే ఈ చేపలు అంతరించిపోయాయి. ఈ చేపలు దాదాపు రెండు మీటర్ల వరకు పొడవు ఉంటాయి. గేషర్ బెనొట్ యాకోవ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున దొరికిన చేపల అవశేషాలను బట్టి చూస్తే ఆదిమానవులు తరచుగా వీటిని తిన్నట్టు తెలుస్తోంది. వారే వంట చేసే పద్ధతులు అభివృద్ధి చేసినట్లు అవగతమవుతోంది. చేపలు వండి తినడం ద్వారా కలిగే ప్రయోజనాలను ఆ రోజుల్లోనే వారు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే తాజా అధ్యయనాల ఆధారంగా మరిన్ని పరిశోధనలు చేసి మానవుడి పుట్టుక, అనంతర పరిణామాలు మరింత లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.