
Pawan Kalyan- YCP: ప్రతి మౌనం వెనుక ఏదో ఒక రాజకీయ వ్యూహం ముడిపడి ఉంటుంది. ఏపీలో ఇటీవల దూకుడు పెంచిన అధికార పార్టీ జనసేన విషయంలో ఎందుకో నెమ్మదించింది. నిన్నా మొన్నటి వరకు పవన్ కల్యాణ్ కాలు కదిపినా వెంటనే స్పందించే వైసీపీ నాయకులు, ప్రస్తుతం మౌనం దాల్చారు. ఇంతలా సైలెంట్ అవ్వడం వెనుక ఏం జరుగుతుందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఏపీ ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ నాయకులు రకరకాలుగా దురాగతాలకు పాల్పడ్డారు. అందుకు పవన్ కల్యాణ్ కు మినహాయింపు ఏమీ ఇవ్వలేదు. గతం కంటే జనసేన ఇప్పుడు బాగా బలపడింది. ఎన్నికలలో అధికారాన్ని డిసైడ్ చేసే స్థాయిలో ఉన్న కాపు ఓట్లను తన వైపునకు తిప్పుకోవడంలో పవన్ సఫలమయ్యారు. మిగతా సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే, కాపులను దగ్గరగా ఉంచుకుంటున్నారు. అంటే ఎన్నికలలో కీ రోల్ గా పవన్ మారారనడంలో సందేహం లేదు.
రెండు రోజుల క్రితం బీజేపీ నేతల వద్దకు వెళ్లిన పవన్ కల్యాణ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వారి ముందుకు ఉంచారు. ఏపీలో తమ పార్టీ బలపడేందుకు జనసేనకు రూట్ మ్యాప్ ఇవ్వాలని ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న అంశంపైనే ఆయన ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష టీడీపీతో కలిసివెళ్లేందుకు సహకారం అందించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, బీజేపీ నేతల మనసులో ఇంకోటుంది. రాబోయేది ప్రభుత్వం వైసీపీనే అన్న భావనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

వైసీపీ కూడా టీడీపీతో జనసేన కలవకూడదనుకున్నట్లు భావిస్తుంది. ఆ మేరకు బీజేపీ నేతలకు రాయబారాలు పంపుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రంలోని బీజేపీ చేస్తున్న ప్రతి పనికి తలూపుతూనే ఉంది. ఇకపై కూడా అదే జరుగుతుందని జగన్ పలుమార్లు హస్తినకు వెళ్లిన ఆయన మోదీ, కేంద్ర మంత్రులకు చెప్పి వస్తున్నారు. బీజేపీ, వైసీపీల దోస్తి అలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ పొత్తు అధికారికంగా జనసేనతో ఉన్నా, అనధికారికంగా వైసీపీతోనే ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే పవన్ కల్యాణ్ కు రూట్ మ్యాప్ కూడా ఇవ్వడ లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని వేచి చూస్తున్న వైసీపీ నేతలు, ఆయన విషయంలో కొంతకాలంగా సైలెంట్ అయిపోయి విమర్శల జోలికి వెళ్లడం లేదు.