Visakhapatnam Capital: వైసీపీ ప్రభుత్వ నాలుగేళ్ల పాలన కరిగిపోయింది. ఉన్నది ఒక్క ఏడాదే. అది ఎన్నికల సంవత్సరం. ప్రభుత్వంపై వ్యతిరేకత చూస్తుంటే పతాక స్థాయిలో ఉంది. దీనిని అధిగమించడం ఎలా? అన్నదానిపై జగన్ ఫోకస్ పెంచారు. మూడు రాజధానుల ముచ్చట కొలిక్కి రాలేదు. రాజధాని లేని నగరంగా ఏపీ నిలబడింది. దీనికి జగన్ వైఖరే కారణమని విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. మరోవైపు విపక్షాలు బలం పెంచుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల మనసును డైవర్ట్ చేయడం ఎలా? అన్నదానిపై జగన్ సర్కారు ఫోకస్ పెట్టింది. తనకు అలవాటైన కుల, మత, ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజల్లో ఒకరకమైన భయపెట్టి . వారిపై ఎమోషనల్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధపడుతోంది.

ఇప్పటికే సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను బయటపెట్టారు. విశాఖ రాజధానికి ప్రతిపక్షాలు అడ్డుకున్నందున ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం కేటాయించాలని డిమాండ్ చేశారు. విశాఖ రాజధానికి ఉత్తరాంధ్ర ప్రజలు మద్దతు తెలపకపోవడం, వైసీపీ ప్రభుత్వ చర్యలను హర్షించకపోవడంతో చాలాసార్లు అసహనం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి బలమైన ఆకాంక్ష లేకున్నా ప్రత్యేక రాష్ట్రం అంటూ హడావుడి చేశారు. దానిపై కూడా ఉత్తరాంధ్ర ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో సైలెంట్ అయ్యారు. అయితే పవన్ యువశక్తి చూపిన సెగలుతో ధర్మాన మళ్లీ బయటకు రావాల్సి వచ్చింది. యువశక్తితో ఉత్తరాంధ్రకు వైసీపీ ఏం చేయలేదన్న అంశాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. దీనిని గ్రహించిన ధర్మాన మీడియా ముందుకొచ్చి పవన్ పై విమర్శలు చేయడంతో పాటు ఉత్తరాంధ్రకు అన్నివిధాలా న్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు.

పవన్ చేసిన విమర్శలను ధర్మాన తప్పుపట్టారు. జగన్ ను కానీ, తమ పాలనను కానీ విమర్శించే హక్కు జనసేనానికి లేదన్నారు. ఉత్తరాంధ్రకు ఏంచేయాలో చెప్పక.. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన ఆరోపణల్లో అర్ధం లేదన్నారు. దశాబ్దలుగా వెనుకబడిన ప్రాంతంలో అభివృద్ధి జరగడం పవన్ కు ఇష్టం లేదా అని వ్యాఖ్యానించారు. పవన్ ఉత్తరాంధ్ర వచ్చి ఇక్కడి ప్రజలను విమర్శించడం ఏమిటన్న వాదనకు ధర్మాన తెరతీశారు. కొంతమంది రియల్టర్ల తరుపున పవన్ మాట్లాడుతున్నారని కొత్తపల్లవిని అందుకున్నారు. లక్ష పుస్తకాలు చదివిన పవన్ వివేకం ఏమయ్యిందని కూడా నిలదీశారు.
అయితే వైసీపీలో సీనియర్ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని చెప్పుకొచ్చారు. అటు దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాల్లో మంత్రిగా ధర్మాన పనిచేశారు. వెనుకబాటు అన్న పదం ఉపయోగించి ఆ పెయిల్యూర్ లో తానూ ఒకడినని చెప్పే సాహసం చేయడం లేదు. మొత్తానికైతే వైసీపీ సర్కారు చర్యలు చూస్తుంటే ఉత్తరాంధ్ర వెనుకబాటుపై రివర్స్ గేర్ లో వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇంతటి వెనుకబాటు ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదన్న పవన్ విమర్శల్లో… కేవలం వెనుకబాటు అనే కాన్సెప్ట్ తీసుకొని పొలిటికల్ గేమ్ ప్లాన్ చేసినట్టుంది. అందుకే ఇంకా స్థల సేకరణ సమస్యను అధిగమించని హార్బర్లు, జెట్టీలను భారీ ప్రాజెక్టులుగా చూపుతోంది. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని తమ ప్రభుత్వమే చూపించిందని చెప్పుకొస్తోంది. మొత్తానికైతే విశాఖ రాజధాని రిహార్సల్స్ లో భాగంగానే ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ ఆయన మాటలను ఉత్తరాంధ్ర ప్రజలు లైట్ తీసుకుంటున్నారు.