MLA Vasantha Krishna Prasad: నిన్నటివరకూ ఏపీలో అధికార వైసీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. అధినేత జగన్ మాటే శిరోధార్యం. ఆయన మాటే మంత్రులు, ఎమ్మెల్యేలకు వేదవాక్కు. ఆయనకు నచ్చేవారికే పదవులు… మెచ్చేవారికే రాజకీయ కొలువులు అన్నట్టు సాగింది మూడున్నరేళ్లు. అయితే ఇన్నాళ్లూ ఒక ఎత్తు. ఇక నుంచి మరో ఎత్తు అన్నట్టుంది ఆయన పరిస్థితి. రోజురోజుకూ పార్టీలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. అలకలు, అసంతృప్తులకు మించి అల్టిమేట్ లువస్తున్నాయి. నేరుగా ప్రభుత్వ చర్యలను తప్పుపట్టే స్థాయికి చేరుకున్నాయి. రేపో మాపో అధినేతపై విమర్శలకు దిగేటంతగా కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఉంది. కొంతమందిని పిలిచి మాట్లాడిన జగన్.. మరికొందర్ని మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగని చర్యలకు ఉపక్రమించడం లేదు. ఒక్క ఆనం రామనారాయణరెడ్డి విషయంలో మాత్రం ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఏర్పాటుచేసి హెచ్చరికలు పంపారు. కానీ మిగతా వారి విషయంలో ఏ సాహసం చేయడం లేదు.

అయితే తాజాగా కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వ్యవహార శైలి పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. ఆయన వరుసగా చేస్తున్న కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అధికార పార్టీని కలవరపెడుతున్నాయి. గత ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుపై పోటీచేసి గెలుపొందారు. పార్టీపై, అధినేత జగన్ పై విధేయత ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే ఆయన ఉన్నపలంగా ధిక్కార స్వరం వినిపించడం ప్రారంభించారు. ప్రధానంగా జోగి రమేష్ మంత్రి అయిన తరువాత అంత కంఫర్టబుల్ గా ఉండలేకపోతున్నారు. మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ చేతులు పెడుతుండమే అందుకు కారణం. హైకమాండ్ కు ఫిర్యాదుచేసినా పట్టించుకోకపోవడంతో వసంత కృష్ణప్రసాద్ అన్నింటికీ సిద్ధమయ్యారన్న టాక్ వినిపిస్తోంది.
కొద్దిరోజుల కిందట గుంటూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి వైసీపీ ప్రభుత్వ చర్యలనుతప్పు పట్టేలా కామెంట్స్ చేశారు. కార్యక్రమ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాసరావు అరెస్ట్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఆయనకు మద్దతుగా మాట్లాడారు. అటు తరువాత నియోజకవర్గ రివ్యూలో సైతం అదే స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. మంత్రి జోగి రమేష్ పేరు పెట్టకుండానే వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పార్టీ తరుపున ఎవర్ని నిలబెట్టినా గెలుపు కోసం పోరాడుతానన్నారు.

తాజాగా విజయవాడ ఎంపీ కేశినాని స్పందిస్తూ వసంత కృష్ణప్రసాద్ మంచి వ్యక్తి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతుంటే అడ్డుకుంటున్నారని చెప్పారు. తన ఎంపీ ల్యాడ్ నిధులు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అయితే వసంత మారిన మాటలు, టీడీపీ నేతలు వత్తాసుగా మాట్లాడుతుండడంతో ఆయన సైకిల్ గూటికి చేరుతారా అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి దేవినేని ఉమా పోటీ చేయడం లేదని.. ఆయనకు వేరే నియోజకవర్గ నుంచి పోటీ చేయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వసంతకృష్ణ ప్రసాద్ చర్యలు చూస్తుంటే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.