Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ? గాజువాకా ? భీమవరమా ?. ఈ రెండూ కాకుండా కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా ? అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమవుతుందన్న నేపథ్యంలో పవన్ పోటీ పై చర్చ మొదలైంది. జనసేనాని వ్యూహం ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి నెలకొంది.

గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఒంటరిగా పోటీ చేయడంతో గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. దీంతో 2024 ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రశ్న మొదలైంది. తిరుపతి, పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలు జనసేన పరిశీలనలో ఉన్నట్టు వినిపిస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఇప్పుడే జనసేన ప్రకటించే అవకాశం లేదు. ఈ మూడు నియోజకవర్గాల పరిశీలన వెనుక జనసేన వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తోంది.
తిరుపతి నుంచి ప్రజారాజ్యం వ్యవస్థాపకుడు మెగాస్టార్ చిరంజీవి గెలిచారు. తిరుపతిలో కాపు సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో జనసేన తిరుపతి స్థానాన్ని పరిశీలిస్తోంది. పిఠాపురం నియోజకవర్గాన్ని కీలకమైన నియోజకవర్గంగా జనసేన పరిగణిస్తోంది. పిఠాపురంలో 75 శాతం కాపు ఓటర్లు ఉన్నారు. పవన్ పోటీ చేస్తే విజయం నల్లేరు మీద నడక అవుతుందని జనసేన నేతలు భావిస్తున్నారు. పిఠాపురం జనసేన నేతలు పవన్ కల్యాణ్ పోటీ పట్ల ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది.

కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజారాజ్యం నుంచి మొదటిసారిగా కురసాల కన్నబాబు గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరి గెలిచారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో దాదాపు లక్షా ఎనభై వేల ఓట్లు ఉంటే.. అందులో లక్ష ఓట్లు కాపులవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ పోటీ చేస్తే పార్టీలకతీతంగా కాపులు జనసేనకు మద్దతు తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయని పక్షంలో.. కాకినాడ రూరల్, పిఠాపురం, తిరుపతి నియోజకవర్గాలను జనసేనాని ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. భీమవరంలో జనసేనాని పోటీ చేస్తే గెలుపు తథ్యమని వైసీపీ తరపున సర్వే నిర్వహించిన ఐపాక్ సంస్థ సర్వేలో కూడ తేలింది. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్ల అక్కడ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఐపాక్ సర్వేలో స్పష్టమయింది. ఈ నేపథ్యంలో జనసేనాని ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న అంశం పై సందిగ్ధత నెలకొంది.