
KCR: రోజులన్నీ మనవే కావాలని లేదు. అన్ని రోజులూ అనుకూలంగా ఉంటాయని అనుకోవద్దు. గాలి ఏటవాలుగా వీచినప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. అదే ఊర్ధ్వ ముఖంగా వీస్తే ఇబ్బందులు మొదలవుతాయి. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి కూడా అలానే ఉంది. దుబ్బాక మొదలు ప్రతి మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ప్రతి కోణంలోనూ తిరుగుబాటు కనిపిస్తోంది. ఇందులో నాగార్జునసాగర్, మునుగోడు ఎన్నికల్ని ఈ గాటి న కట్టలేము. ఎందుకంటే నాగార్జునసాగర్ అధికార భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ సీటు కాబట్టి దానిని భారత రాష్ట్ర సమితి ఖాతాలో వేయలేము. అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడమే “10,000” కాబట్టి.. దానిని కూడా భారత రాష్ట్ర సమితి ఘనత అనుకోలేము.
వాస్తవంగా తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం.. ఆ నియామకల్లోనూ పోలీస్ శాఖ మినహా మిగతా వాటి భర్తీలో ప్రభుత్వం అంతులేని జాప్యాన్ని ప్రదర్శిస్తోంది. పైగా లేక లేక ఒక నోటిఫికేషన్ ఇచ్చి, ఇప్పుడు పేపర్ లీకేజీతో తీవ్రంగా అభాసుపాలవుతున్నది. లక్షలాదిమంది నిరుద్యోగుల భవితవ్యాన్ని ఫణంగా పెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే భారత రాష్ట్ర సమితి ఘనతలు అన్ని ఇన్ని కావు. ఇక ఉద్యోగుల విషయంలోనూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు పోతోంది.. దీనివల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ప్రభుత్వంపై నిగురుగప్పిన నిప్పులాగా ఉన్న ఉపాధ్యాయులు.. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇదే సమయంలో వారు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించారు. వాస్తవానికి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. పీఆర్టీయూ కూడా బలంగానే ఉంది. యూటీఎఫ్ ను కూడా కొట్టి పారేయలేని పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న బలం అంతతమాత్రమే. ఈ క్రమంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నియామకాలు, పదోన్నతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం వంటి చర్యలతో ఉపాధ్యాయ లోకం విసిగి వేసారి పోయింది.. పైగా అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ తీసుకొచ్చిన వివాదస్పద జీవో వల్ల నలుగురు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత జరిగినా కించిత్ కూడా ప్రయాశ్చిత్తం లేకపోవడం విశేషం.
మరోవైపు ఈ ఎమ్మెల్సీ విజయంతో అధికార భారత రాష్ట్ర సమితి కౌంట్ డౌన్ స్టార్ట్ షురూ అయిందని భారతీయ జనతా పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు.. ప్రభుత్వంపై సామాన్య ప్రజలకే కాదు ఉపాధ్యాయులకు కూడా విరక్తి వచ్చేసిందని చెప్తున్నారు. అందుకు నిదర్శనమే ఈ ఎమ్మెల్సీ ఫలితాలని చెప్తున్నారు. అటు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల రద్దు, ఇటు మద్యం కుంభకోణంలో కవిత ఇరుక్కుపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థి గెలవటం.. పాపం అధికార బీఆర్ఎస్ కు ఎన్ని కష్టాలో?!