
TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టౌన్ ప్లానింగ్ ప్రశ్నాపత్రాల లీకేజీతో మొదలైన ప్రవీణ్‌కుమార్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోన్నాయి. అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు వచ్చిన వార్తలు నిజం అయ్యాయి. ఏఈ పరీక్షా పత్రం లీక్ అయినట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు నిర్ధారించారు. దీనితో ఆ పరీక్షను రద్దు చేశారు.
తాజాగా గ్రూప్–1 ప్రిలిమ్స్ కూడా..
తాజాగా గతేడాది అక్టోబర్‌లో జగిరిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈ పరీక్ష ఫలితాలు కూడా విడుదల కావడంతో 55 వేల మంది మెయిన్స్‌కు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ప్రవీణ్‌కుమార్ గ్రూప్–1 పరీక్ష రాయడం అతడికి 103 మార్కులు వచ్చినట్లు ఓఎంఆర్ షీట్ బయటకు రావడంతో ఆ పరీక్ష కూడా రద్దు చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. దీంతోపాటు త్వరలో జరిగే ఏఈఈ, డీఏవో, జూనియర్ లెక్చరర్స్ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
జూన్ 11న గ్రూప్–1 ప్రిలిమ్స్..
ఇదిలా ఉండగా రద్దు చేసిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను తిరిగి జూన్ 11న నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు నోటిఫికేషన్ కూడా శుక్రవారం విడుదల చేసింది. మిగతా టౌన్‌ప్లానింగ్ అధికారి, ఏఈ, ఏఈఈ, డీఏవో, జూనియర్ లెక్చరర్స్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించలనేది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.

మళ్లీ ఎప్పుడు..?
తాజాగా రద్దు చేసిన ఏఈ, ఏఈఈ, డీఏవో, జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తెలియజేస్తామని పేర్కొన్నారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి ఈ పరీక్షను నిర్వహించారు. లీక్ నేపథ్యంలో దీన్ని అధికారులు రద్దు చేశారు. త్వరలోనే మళ్లీ నిర్వహిస్తామని తెలిపారు.
షెడ్యూల్ మొత్తం మార్పు…
తాజా పరిణామాలతో టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్ మొత్తం మారే అవకాశం ఉంది. వచ్చే రెండు మూడు నెలల్లో జరిగే ప్రశ్న పత్రాలను కూడా మార్చాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అన్ని పరీక్షల తేదీలు మారుతాయని తెలుస్తోంది. ఈమేరకు త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.