
దేశంలో రోజురోజుకు మోసాలు చేసే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మోసాల్లో ఎక్కువ మోసాలు బ్యాంకింగ్ మరియు కేవైసీ మోసాలే కావడం గమనార్హం. వన్ టైమ్ పాస్ వర్డ్ లు చెప్పాలంటూ, క్యూఆర్ కోడ్ లు చెప్పాలంటూ చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు మోసగాళ్లు సిమ్ స్వాప్ తో లక్షల రూపాయలు ఖాతాల నుంచి మాయం చేస్తున్నారు.
‘
నవీన పద్దతుల్లో హైటెక్ దోపిడీ చేస్తూ అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం ఒకవైపు పెరుగుతుంటే జనాలను కొత్త పద్దతుల్లో మోసాలు చేసే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో సిమ్ కార్డ్ ను అప్ డేట్ చేయాలంటూ మనకు తెలియకుండా మనమే సిమ్ కార్డును బ్లాక్ చేసేలా చేసి అదే నంబర్ తో సిమ్ స్వాప్ చేసి బ్యాంక్ ఖాతాలలోని నగదును మోసగాళ్లు మాయం చేస్తున్నారు.
బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సిమ్ పని చేయకపోవడంతో బ్యాంక్ ఖాతాల్లో నగదు మాయమైనా చాలామంది ఖాతాదారులు వేగంగా గుర్తించలేకపోతున్నారు. ఆలస్యంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. సైబర్ నేరగాళ్లు స్విమ్ స్వాప్ మోసంతో రెచ్చిపోతున్నారు. కస్టమర్ కేర్ పేరుతో ఫోన్ చేసి ఆధార్, బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకుని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
సైబర్ నేరగాళ్లు సిమ్ కార్డ్ బ్లాక్ అవుతుందని మెసేజ్ పంపి ఆ తరువాత కస్టమర్ కేర్ నంబర్ తో కాల్ చేసి కైవైసీ వివరాలను అప్ డేట్ చేసుకోవాలని చెబుతూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతాలు, ఓటీపీలు, యూపీఐ పిన్ వివరాలను ఎవరికీ చెప్పవద్దని టెక్ నిపుణులు చెబుతున్నారు.