
Rajamouli- D. V. V. Danayya: నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్… ఒక సినిమాకు కావాల్సిన నాలుగు పిల్లర్స్. దర్శకుడి సృజన, నటుల ప్రతిభకు తెర రూపం ఇవ్వాలంటే డబ్బులు కావాలి. ముడి సరుకును అంతా ఒక చోటికి చేర్చి సినిమాగా మార్చే వ్యక్తి నిర్మాత. అలాగే సినిమా అటూఇటూ అయితే మొదట మునిగేది నిర్మాతే. కాబట్టి ఒక సినిమా విజయంలో ఆయనకు దక్కాల్సిన క్రెడిట్ చాలానే ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగా ఆ చిత్ర నిర్మాత ఎవరో కేవలం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే తెలుసు.
రాజమౌళి తన సినిమాలకు అన్నీతానై వ్యవహరిస్తారు. సాధారంగా మూవీ హిట్ అయితే హీరో పేరు చెప్పుకుంటారు. ఒక్క రాజమౌళి విషయంలో అది రివర్స్. రాజమౌళి వలన హీరోలకు దక్కిన గౌరవం, గుర్తింపు అంటారు. ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆస్కార్ గెలిచిన ఆర్ ఆర్ ఆర్ చిత్ర నిర్మాత డివివి దానయ్య పేరు ఎక్కడా వినబడలేదు. అమెరికా వేదికగా అనేక అంతర్జాతీయ సినిమా వేదికలపై ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శించారు. రాజమౌళి న్యూ యార్క్ క్రిటిక్స్ అవార్డు అందుకున్నారు.
ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి హాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. ఎక్కడ కూడా దానయ్యకు క్రెడిట్ ఇవ్వలేదు. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ విజయాల్లో కూడా అదే తీరు. ఇది కావాలని చేస్తున్న వ్యవహారమే అని అర్థమైంది. దానయ్యతో రాజమౌళికి చెడింది. దానయ్య ప్రస్తావన తేవద్దని ఆయన యూనిట్ కి సూచించారని వినికిడి. చాలా సౌమ్యుడిగా కనిపించే దానయ్యతో రాజమౌళికి ఎందుకు గొడవలు జరిగాయనే విషయంలో కొన్ని వాదనలు తెరపైకి వచ్చాయి.

ఆస్కార్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ దాదాపు రూ. 80 కోట్లు ఖర్చు చేశారు. అమెరికాలో ఉన్న కొన్ని ప్రమోషనల్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నారు. దీని కోసం ఒక ప్రణాళిక వేసిన రాజమౌళి బడ్జెట్ గురించి దానయ్యతో చర్చించారు. అంత డబ్బు ఖర్చు చేయడం నా వల్ల కాదు. రిస్క్ చేసి కోట్లు కుమ్మరించినా ఆస్కార్ వస్తుందన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఈ ఖర్చుతో నాకు సంబంధం లేదన్నారట. దానికి ఆగ్రహించిన రాజమౌళి ఇతర మార్గాల ద్వారా డబ్బు సమకూర్చుకున్నారట.
అలాగే ఆర్ ఆర్ ఆర్ మూవీ వలన దానయ్యకు పెద్దగా మిగిలింది ఏం లేదు. రెండేళ్లు అనుకున్న మూవీ నాలుగేళ్లు పట్టింది. బడ్జెట్ పరిమితులు దాటిపోయింది. వచ్చిన లాభాల్లో వడ్డీల రూపంలో చాలా పోయిందట. కేవలం 25 శాతం మాత్రమే లాభాల్లో ఆయనకు మిగిలిందట. అందుకే ఆస్కార్ క్యాంపైన్ కి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వన్నారట. ఇదే అసలు కారణమని పరిశ్రమ వర్గాల వాదన. ఈ పుకార్ల నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన డివివి దానయ్య రాజమౌళితో ఎలాంటి గొడవ లేదన్నట్లు మాట్లాడారు.