
CM Jagan: ఏపీ సీఎం జగన్ నిజంగా భయపడుతున్నారా? ఎమ్మెల్యేల ధిక్కార స్వరంతో వెనక్కి తగ్గారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో పునరాలోచనలో పడ్డారా? దూకుడు తగ్గించుకున్నారా? అందుకే మొన్న జరిగిన పార్టీ వర్క్ షాపులో మెత్తబడుతూ మాట్లాడారా? పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, నియోజకవర్గ ఇన్ చార్జీలను బుజ్జగించారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అనుకూల మీడియా ఒకలా… వ్యతిరేక మీడియా మరోలా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు వర్క్ షాపు లో సీఎం చేసిన కామెంట్స్ పై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. జగన్ మునపటిలా ధైర్యం చూపలేకపోతున్నారని.. ఏ ఒక్కర్నీ వదులుకోనని చెప్పడం ద్వారా బుజ్జగింపులకు దిగిపోయారని ప్రచారం ఊపందుకుంది.
వర్కు షాపులో కీలక ప్రసంగం..
వర్కు షాపులో జగన్ కీలక ప్రసంగం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేలు, మంత్రులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీని ధిక్కరించిన నలుగురు ఎమ్మెల్యేల విషయం పరోక్షంగా ప్రస్తావించారు. ఈ క్రమంలో పార్టీతో పాటు ప్రభుత్వంపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. వచ్చే ఎన్నికల్లో 60 మందికి సీట్లు ఇవ్వరని ప్రచారం చేస్తున్నారని.. అందులో నిజం లేదని తేల్చారు. ఏ ఒక్కర్నీ వదులుకోవడం తానకు ఇష్టం లేదని.. ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటానని చెప్పారు. అయితే ఇక్కడే జగన్ తన చతురతను ప్రదర్శించారు. ఏ ఒక్కర్నీ వదులుకోనని చెప్పారే కానీ.. అందరికీ టిక్కెట్లు ఇస్తానని మాత్రం చెప్పలేదు. పైగా పార్టీపరంగా చాలా రకాల ప్రత్యామ్నాయ అవకాశాలున్నాయని.. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్న విషయాన్ని ప్రస్తావించడం ద్వారా కొందరు త్యాగాలు చేయాల్సి ఉంటుందని సంకేతాలిచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు
ఇప్పటికీ అవే సంకేతాలు..
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత పరాజయం ఎదురైనా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గిన సందర్భాలు కనిపించలేదు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు విడమరచి చెప్పే క్రమంలో ఆయన వెనక్కి తగ్గినట్టు కనిపించింది. కానీ అభద్రతాభావంతో ఉన్నవారిని ఊరడింపుగా ఎటువంటి మాటలు చెప్పలేదు.ఎవర్నీ వదులుకోనన్న మాట తప్పించి..ఇంకా ఏ స్వాంతన చేకూర్చలేదు. దీనిని సహసమనే చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఇటువంటి సాహసాన్నే చేసి జగన్ చేతులు కాల్చుకున్నారు. ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్ కు ఒక రోజు ముందు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జగన్ ను కలిశారు. అప్పుడు కూడా మీకు టిక్కెట్లు ఇవ్వలేనని ముఖం మీద చెప్పి సాహసం చేశారు. దానికి మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు పార్టీ వర్క్ షాపులో సైతం ప్రత్యామ్నాయ అవకాశాలున్నాయని చెప్పి చాలామందికి మార్పు ఉంటుందని సంకేతాలిచ్చారు. అయితే వైసీపీలో ఒక సెక్షన్ దీనిని సాహసం అంటుండగా.. అభద్రతాభావంతో ఉన్నవారు మాత్రం మరోలా ప్రచారం చేస్తున్నారు.

దూకుడు వైపే మొగ్గు..
జగన్ సాహసోపేత నిర్ణయాలతోనే మరోసారి రాటు దేలాలని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే ఏం జరిగినా తాను సిద్ధమేనన్నట్టు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేల రూపంలో ధిక్కారాలు ఎదురైనా.. ప్రత్యామ్నాయ నాయకులతో ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నారు. అందుకే ఎక్కడికక్కడే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తయారుచేసుకున్నారు. అయితే రాజకీయాల్లో ఇటువంటి దుందుడుకు చర్యలు ఒకోసారి తీవ్ర నష్టం చేస్తాయి. అది జగన్ కు తెలియంది కాదు. అయినా ఇప్పుడున్న సిట్యువేషన్ లో కఠినంగా వ్యవహరించక తప్పని పరిస్థి తి జగన్ కు ఎదురైంది. అందుకే లాభ నష్టాలను భేరీజు వేసుకోకుండా తనకు తెలిసిన దూకుడుతోనే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇది విజయం చేకూరుస్తుందో.. లేక మూల్యానికి బలి కావాల్సి ఉంటుందో చూడాలి మరీ.