
BRS Balagam Posters: బలగం.. బలగం.. తెలంగాణలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఏ ఊర్లో చూసినా ఈ సినిమా ముచ్చట్లే. సందర్భంతో పనిలేకుండా ప్రతీ గ్రామంలో ‘బలగం’ సినిమా రన్ చేస్తుండడంతో ఊరంతా ఒక్కటవుతున్నారు. ఈ సమయంలో అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు వచ్చిన హైప్ ను కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారు. బలగం టైటిల్ తో ప్రజలకు చేరువవుతున్నారు. మా ‘బలగం’ ప్రజలే అంటూ వెలిసిన కొన్ని పోస్టర్లు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. వాడుకోవడానికి కాదేదీ అనర్హం అన్నట్లు ఈ సినిమాను రాజకీయాలకు వాడుకోవడం ఆసక్తిగా మారతోంది.
భారత రాష్ట్ర సమితికి చెందిన పోస్టర్లు వెలిశాయి. ఇందులో మా బలం మీరే… ‘బలగం’ మీరే.. అంటూ సినిమా టైటిల్ ను అందులో చేర్చారు. ఈ పోస్టర్లో కేసీఆర్ ఫొటో తో పాటు స్థానిక నాయకులు ఫొటోలను పెట్టారు. ఏదైనా వినూత్నంగా చేస్తేనే ప్రజలు ఆలోచిస్తారు. అందుకే ఇప్పుడంతా బలగం హవా నడుస్తుండడంతో చాలా మంది ఈ టైటిల్ ను వాడుకుంటున్నారు. మరికొందరు బలంగంలోని సీన్స్ తో మీమ్స్ తయారు చేస్తున్నారు. ఈ వీడియోలోని కొన్ని సన్నివేశాలతో కామెడీ చేస్తున్నారు. మరి కొందరు ప్రజలను ఆకట్టుకునేవిధంగా రాజకీయంగా వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.
తెలంగాణలో మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు సమీపించనున్నాయి. ఈ తరుణంలో ప్రజల్లో గుర్తింపు పొందేందుకు ఏదో ఒకటి చేయాలన్న తపన ప్రతి రాజకీయ నాయకుడిలో ఉంది. దీంతో సేవా కార్యాక్రమాలతో పాటు బలగం సినిమాతో తమను ప్రచారం చేసుకుంటున్నారు. చాలా ఊళ్లల్లో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ లు, చోటా మోటా నాయకులు సినిమాను ప్రదర్శిస్తూ వారి మన్ననలను పొందుతున్నారు. వీరే కాకుండా కాంగ్రెస్, బీజేపీకి చెందిన కొందరు నాయకులు సైతం ఏదైనా పెద్దకర్మ, సంవత్సరీకం ప్రదేశాల్లోనూ బలగం మూవీని ఉచితంగా ప్రసారం చేయిస్తున్నారు.

వాడుకోవడానికి కాదేదీ అనర్హం అన్నట్లు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులకు ఇదోక మంచి అస్త్రంలా మారింది. జనాలను ఆకట్టుకోవడానికి బలగం ద్వారా వెళితే తమను ఆదరిస్తారని చాలా మంది అనుకుంటున్నారు. అయితే బలగం మూవీ తన కథ ద్వారా జనాల్లోకి చొచ్చుకు వెళ్లినట్లు రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుందా? అని అనుకుంటున్నారు. ఫలితం ఎలా ఉన్నాఈ సినిమాను మాత్రం ఆమాంత వాడేసుకుంటున్నారని రాజకీయాంగా చర్చించుకుంటున్నారు.