Naa Anveshana: ప్రస్తుతం సమాజం స్మార్ట్ గా మారిపోయింది. ఈ స్మార్ట్ కాలంలో సమాజాన్ని ఎవరు ఎంతగా ప్రభావితం చేస్తే అంత గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఇన్ ఫ్లూయన్సర్లు పెరిగిపోతున్నారు. ఆదాయానికి ఆదాయం.. పేరుకు పేరు రావడంతో చాలామంది ఈ రంగంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే విజయవంతమవుతున్నారు. ఇక తెలుగులో ప్రముఖ టూరిస్ట్ వ్లాగర్ గా పేరుపొందాడు “నా అన్వేషణ” అన్వేష్.
Also Read: ఎట్టకేలకు ‘బాహుబలి 2 ‘ ని దాటేసిన ‘చావా’..’పుష్ప 2′ ని అందుకోవాలంటే ఇంకా ఎంత గ్రాస్ రావాలో తెలుసా!
ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం చెందిన అన్వేష్.. అనేక కష్టాలు పడి యూట్యూబర్ గా పేరుపొందాడు. ప్రస్తుతం అతడికి దాదాపు 14 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతనికి ప్రపంచం మొత్తాన్ని చుట్టి రావడం అంటే చాలా ఇష్టం. అందువల్లే అమెరికా నుంచి మొదలు పెడితే అమెజాన్ వరకు అతడు తిరుగుతూనే ఉన్నాడు. ఏడు ఖండాలు.. సప్త సముద్రాలు మొత్తం చుట్టి రావాలి అనేది అతడి కల. దానిని నెరవేర్చుకోవడానికి అతడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో ఎన్నో కష్టాలను అతడు అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ తన ప్రయాణంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. జీవితాన్ని నిట్టూర్చి బతకడం కంటే.. ఆస్వాదిస్తూ ఉండడమే మేలని అతడు నిరూపిస్తున్నాడు. అందువల్లే అతడిని లక్షల మంది అభిమానిస్తున్నారు. అతడి చానల్లో ప్రముఖ యువనటుడు నవీన్ పోలిశెట్టి నుంచి మొదలు పెడితే గోపీచంద్ వరకు కనిపించారు. దీనిని బట్టి అతడికి ఉన్న పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు. అదే కాదు కేవలం టూరిస్ట్ వ్లాగర్ గానే కాదు.. అప్పుడప్పుడు జీవిత సత్యాలను కూడా అన్వేష్ చెబుతుంటాడు. ఇటీవల చైనా తయారు చేసిన డీప్ సీక్ పై అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను ప్రకంపనలు సృష్టించాయి.
సజ్జనార్ సార్ తో మాటలు..
ఆర్టీసీ ఎండీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ సార్ తో ఇటీవల అన్వేష్ వీడియో కాల్ లో మాట్లాడారు. వారిద్దరూ అనేక విషయాలపై చర్చించుకున్నారు. వీరిద్దరూ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తులే కాబట్టి.. ఇద్దరి మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి. సజ్జనార్ సార్ కాస్త చలాకీ మనిషి కాబట్టి.. సీరియస్ టాపిక్ లు పక్కనపెట్టి.. “ఈ నాలుగేళ్లు ప్రపంచాన్ని చుట్టి రావాలి అను నిర్ణయించుకున్నారు కదా.. మరి పెళ్లి సంగతేంటి” అని అన్వేష్ ను సజ్జనార్ సార్ ప్రశ్నించారు. దానికి అన్వేష్ “వండుకునే వాడికి ఒక్క కూర.. అడుక్కునే వాడికి 66 కూరలు” అని సజ్జనార్ సార్ కు బదిలిచ్చాడు. మొదట్లో అన్వేష్ సమాధానం సజ్జనార్ సార్ కు అర్థం కాలేదు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి సజ్జానార్ సార్ కూడా నవ్వుకున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియా గ్రూపులలో తెగ షేర్ చేస్తున్నారు. ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
