
MS Dhoni IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో మొదలుపెట్టింది. గత ఏడాది ట్రోఫీ విజేత గుజరాత్ తో జరిగిన తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. బ్యాటింగ్ లో గైక్వాడ్, ధోని మినహా మిగతావారు మొత్తం విఫలం కావడం, బౌలింగ్ లోనూ అదే ఒరవడి కొనసాగించడంతో చెన్నై జట్టు గుజరాత్ ముందు తలవంచాల్సి వచ్చింది. మొత్తానికి ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలు కావాల్సి వచ్చింది.
అయితే ఈ మ్యాచ్ అనంతరం ధోని విలేకరులతో మాట్లాడాడు. మ్యాచ్లో ఓటమికి బ్యాటింగ్లో చేసిన తప్పిదమే కారణమని అభిప్రాయపడ్డాడు. మైదానంపై తేమ ఉన్న నేపథ్యంలో అదనంగా పరుగులు చేస్తే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది అని పేర్కొన్నాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్ ను కొనియాడాడు. అతడి అసాధారణ బ్యాటింగ్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. “గైక్వాడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. బంతిని సరైన సమయంలో టైమింగ్ చేశాడు. అతడి బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంది. అతడు ఆడిన విధానం, ఎంచుకున్న షాట్లు చాలా బాగున్నాయి” అని ధోని కితాబిచ్చాడు. ” డ్యూ ఉంటుందని మాకు తెలుసు. ఎందుకంటే మైదానం అలా ఉంది. అయినప్పటికీ మేము బ్యాటింగ్లో అదనంగా పరుగులు చేయలేకపోయామని” ధోని వివరించాడు. “15_20 పరుగులు ఎక్కువ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది.” అని ధోని అభిప్రాయపడ్డాడు.

“యువ ఆటగాళ్లు సత్తా చాటాల్సి ఉంది.. ముఖ్యంగా హంగార్కేర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు ఇంకా రాటు దేలాల్సి ఉంది. టోర్నీ జరుగుతున్న కొద్దీ అతడు ఇంకా మెరుగవుతాడు.. బౌలర్లు కొన్ని తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. దీపక్ 19 ఓవర్లో అన్నేసి పరుగులు ఇవ్వటం జట్టు విజయా అవకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా బౌలర్లు నోబాల్స్ వేయడం తగ్గించాలి” అని ధోని చురకలు అంటించాడు.
“ఎందుకంటే నోబాల్స్ వేయడం వల్ల మా జట్టు విజయవకాశాలు సన్నగిల్లాయి. ఇద్దరు లెఫ్ట్ ఆర్మర్స్ ఉండడం బెటర్ ఆప్షన్ అనుకున్నా. అందుకే ఇద్దర్నీ తీసుకున్నా. శివమ్ ధూబే రూపంలో నాకు ఒక అవకాశం ఉంది.. కానీ అతడికి బౌలింగ్ ఇవ్వాల్సిన అవసరం నాకు కనిపించలేదు.. కానీ ఆ నిర్ణయాన్ని పున: సమీక్షించుకొని అతడికి కనక బౌలింగ్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది” అని ధోని వివరించాడు.. ఇవ్వటమే మాకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. వీటిని మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటాం అని ధోని ముగించాడు.