
IPL 2023 Opening Ceremony: ఐపీఎల్ 16వ సీజన్ కు సర్వం సిద్ధమైంది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. భారీగా హాజరయ్యే ప్రేక్షకుల మధ్య ఐపిఎల్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేసింది. ఆటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చేందుకు సినీ తారలతో వేడుకలు నిర్వహించనుంది. ప్రారంభ కార్యక్రమంలో సినీ తారలు తమన్న భాటియా, రష్మిక మందాన ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన రిహార్సల్స్ లో వారు పాల్గొంటున్నారు. గత కొద్దిరోజులుగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ప్రత్యేక ప్రదర్శన
ఆరంభ వేడుకల్లో స్టార్ సింగర్ అరిజిత్ సింగ్ ప్రదర్శన ఇవ్వనున్నారు.. అరిజిత్ సింగ్, రష్మిక మందన తో కలిసి ప్రదర్శన ఇవ్వనున్నాడు. ఇక్కడ ప్రదర్శించినకు గానూ ఐపీఎల్ నిర్వాహకులు తమన్నా, రష్మిక, అరిజిత్ సింగ్ కు కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు సమాచారం.. గతంలో ఉత్తరాది సినీ తారలతో ప్రదర్శనలు నిర్వహించిన ఐపీఎల్ నిర్వాహకులు.. ఈసారి ఆరంభ వేడుకలకు దక్షిణాది నటి అయిన రష్మికను తీసుకోవడం విశేషం.. తను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. ఈ వేడుకల్లో రష్మిక పాల్గొనడం తన కెరియర్ కు మంచి బూస్ట్ ఇస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ నటీనటులు కేవలం ఇక్కడ మాత్రమే కాదు .. ఇటీవల నిర్వహించిన ఫిఫా వరల్డ్ కప్ వేడుకల్లోనూ సత్తా చాటారు. దీపికా పదుకొనే ఖతర్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభ వేడుకల్లో సందడి చేశారు. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలోనూ మెరిశారు. దీనికి గానూ ఆమెకు భారీ స్థాయిలో పారితోషికం ముట్ట చెప్పారు.

2007లో మొదలైన ఐపిఎల్ ప్రారంభ సీజన్ లో ఈ ఆనవాయితిని మొదలుపెట్టిన నిర్వాహకులు.. 15 సీజన్ల వరకు విజయవంతంగా కొనసాగించారు. 16వ సీజన్లోనూ ఇదే సూత్రాన్ని అవలంబిస్తున్నారు. గత మూడు సీజన్లోనూ కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ప్రారంభ వేడుకలు నిర్వహించారు. ఇలా సినీ తారలతో ప్రారంభ వేడుకలు నిర్వహించడం వల్ల ఆటకు మరింత అందం వస్తుందని ఐపీఎల్ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.. అభిమానులను అలరించేందుకు సినీ తారలు కూడా కఠోర సాధన చేస్తున్నారు. దక్షిణాదిలో పాపులరయిన పాటలకు నృత్యాలు చేస్తున్నారు.