Visakhapatnam Yoga Day2025 : 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న నేపథ్యంలో.. జాతీయవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి విశాఖపట్నం మీద కేంద్రీకృతమైంది. పైగా ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం న భూతో న భవిష్యతి అనే స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలోని కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి రాక ప్రాధాన్యం సంతరించుకుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని “యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్” అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఇదే విషయాన్ని దేశ ప్రధాని మార్చి 30న మన్ కీ బాత్ కార్యక్రమంలో వెల్లడించారు.
విశాఖపట్నం ఎందుకంటే..
విశాఖపట్నం లో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. భౌగోళికంగా ఈ నగరం ఎంతో విశాలమైంది. అత్యంత సుందరమైన సముద్రతీరం ఉంది. విస్తారమైన సముద్రం ఉంది. ప్రకృతి పరంగా కూడా ఈ నగరానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. విశాఖపట్నంలో ఆర్కే బీచ్ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. విశాఖ నగరానికి దగ్గర్లో అనేక ఆలయాలు.. ప్రకృతి రమణీయతను పెంపొందించే పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. అందువల్లే నరేంద్ర మోడీ ఈ నగరాన్ని 11 అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేంద్రంగా చేసుకున్నారు. దీనివల్ల పర్యాటకంగా విశాఖపట్నం నగరానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. ఈ నగరాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.
గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా..
ఆర్కే బీచ్ లో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించడానికి భారీగా ఏర్పాటు చేశారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి ప్రాంతం వరకు ఏకంగా 26.5 కిలోమీటర్ల తీర ప్రాంతంలో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ప్రాంగణంలో దాదాపు 2.5 లక్షల మంది యోగా దినోత్సవం లో పాల్గొంటారు. వీరందరికీ యోగా మ్యాట్లు, టీ షర్టులు పంపిణీ చేస్తారు. 2023లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ ప్రాంతంలో యోగా దినోత్సవం నిర్వహించారు. నాడు 1.53 లక్షల మంది యోగా దినోత్సవం లో పాల్గొన్నారు. అప్పట్లో అది ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ ఘనతను విశాఖపట్నం అధిగమించే అవకాశం ఉంది. ఇక ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం యోగాంధ్ర అని పేరు పెట్టింది. యోగాంధ్ర కార్యక్రమంపై విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అంతేకాదు గడిచిన నెలలో 21 తేదీ నుంచి ఈ నెల 21 వరకు నెల రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. యోగ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలకు ఆరోగ్య ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు. అత్యంత ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గడచిన నెల 21 నుంచి మొదలైన యోగాంధ్ర కార్యక్రమం.. ఈనెల 21న ముగుస్తుంది.