Umang App: సాధారణంగా ప్రభుత్వ సేవలను పొందాలనుకుంటే.. అందుకోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. పనులన్నింటినీ పక్కన పెట్టి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన ఆ రోజు అధికారులు అందుబాటులో లేకపోతే పని జరిగేది కాదు. దీంతో ఏదైనా ఒక పని పూర్తి కావాలంటే కనీసం రెండు, మూడు రోజులు పట్టేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో ఏ పని అయినా నిమిషాల్లో చేసుకునే వెసులుబాటు వచ్చింది.
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్ పేరు ‘ ఉమాంగ్ (UMANG). అంతేకాదు అందరికీ ఉపయోగపడాలని మొత్తం 13 స్థానిక భాషల్లో ఈ యాప్ ను వినియోగంలోకి తీసుకువచ్చింది. అయితే ఈ యాప్ ఏంటి? ఎందుకు ఉపయోగపడుతుందనే విషయాలను మనం తెలుసుకుందాం.
ఉమాంగ్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్ (UMANG – Unified Mobile Application for New-age Governance). ఈ యాప్ ద్వారా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సేవలన్నీ ఒకే ప్లాట్ ఫామ్ పై అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ సేవల కోసం రకరకాల యాప్ లను ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుని ఇబ్బందులు పడే బదులు ఈ ఒక్క యాప్ తో అన్ని రకాల ప్రభుత్వ సేవలను పొందవచ్చు.
ఇందుకోసం ముందుగా మొబైల్ లోని గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. తరువాత పేరు, మొబైల్ నంబర్, వయసు వంటి వ్యక్తిగత వివరాలతో ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తరువాత ప్రొఫైల్ ఫొటోను అప్ లోడ్ చేసుకోవాలి. ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తరువాత లాగిన్ అయి సేవలన పొందడానికి Sort & Filter విభాగానికి వెళ్లాలి. అనంతరం కావాల్సిన సేవల కోసం ‘search option’ కి వెళ్లాలి. అలాగే ఆధార్ నంబర్ ను యాప్ తో పాటు ఇతర సోషల్ మీడియా ఖాతాలకు కూడా లింక్ చేసుకునే అవకాశం ఉంది.
కాగా ఈ ఉమాంగ్ యాప్ ద్వారా.. ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సేవలు, గ్యాస్సిలిండర్ , పాన్ కార్డు, ఆదాయపు పన్ను, పాస్‌పోర్ట్ సేవలు పొందడంతో పాటు యుటిలిటీ బిల్లు పేమెంట్లను చేసుకోవచ్చు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, జీఎస్టీ, పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లాంటి సేవలు పొందవచ్చు. వ్యవసాయ సలహా సేవలు, ఆన్‌లైన్ జాబ్ అప్లికేషన్ సిస్టమ్, సాయిల్ హెల్త్ కార్డ్, సుఖద్ యాత్ర , పెన్షన్ పోర్టల్ వంటి పలు సేవలను ఈ యాప్ ద్వారా పొందే అవకాశం ఉంది.