CM Jagan: ఏపీ రాజకీయాల్లో కీలక ట్విస్ట్. టిడిపి, జనసేనతో బిజెపి చేరడం దాదాపు ఖాయమవుతున్న వేళ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర పెద్దలను కలుసుకోనున్నారు. మరోవైపు ఈరోజు పవన్ అత్యవసరంగా ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఢిల్లీ నుంచి ఈరోజు హైదరాబాద్ చేరుకోనున్న చంద్రబాబు తన షెడ్యూల్ మార్చుకున్నారు. పవన్ తో కలిసి బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరుపుతారని సమాచారం. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ ఢిల్లీ టూర్ ఖరారైంది. దీంతో దేశ రాజధాని లో ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టిడిపి తో బీజేపీ పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. 2014 పొత్తు రిపీట్ అయ్యేలా ఉంది. అదే జరిగితే జగన్ కు ఇబ్బందికర పరిస్థితి తప్పదని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఎన్డీఏలో చేరికపై దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ఖరారైంది. ఈనెల 11న ఆయన ఢిల్లీ వెళ్ళనున్నారు. 12న ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు. సీఎం జగన్ ఢిల్లీ సడన్ టూర్ తో రాప్తాడు లో జరగాల్సిన సిద్ధం బహిరంగ సభను.. ఈనెల 18వ తేదీకి వాయిదా వేశారు.
అయితే జగన్ ఢిల్లీ టూర్ రాజకీయ పర్యటన కాదని.. విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ప్రధానితో పాటు మంత్రులను కలవనున్నట్లు తెలుస్తోంది. టిడిపితో పొత్తు కుదుర్చుకున్న వేళ.. బిజెపిని సైతం జగన్ ప్రత్యర్థిగా చూసే అవకాశం ఉంది. అయితే 2019 ఎన్నికల అనంతరం బిజెపికి విధానపరమైన అంశాల్లో జగన్ మద్దతు ఇస్తూ వచ్చారు. అధికారికంగా ఎన్డీఏలో చేరలేదు కానీ.. అంతకుమించి అన్నట్టు వ్యవహరించారు. ఇప్పుడు అదే బిజెపి తన ప్రత్యర్థి చంద్రబాబుతో చేతులు కలపడం పై జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే జగన్ తాజా పర్యటనలో బిజెపి అగ్ర నేతలను సైతం కలవనున్నారు. టిడిపితో కలవద్దని విజ్ఞప్తి చేస్తారా? గతం మాదిరిగా బయట నుంచి మద్దతు తెలుపుతామని చెబుతారా? అందుకు బిజెపి అగ్ర నేతలు అంగీకరిస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే జగన్ రాజకీయాల కోసం కలవడం లేదని.. పోలవరం విషయంలో ఖర్చు చేసిన నిధులను రీయంబర్స్మెంట్ రూపంలో ఇవ్వాలని అడిగేందుకే ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీలోని కీలక రాజకీయ నాయకులంతా హస్తినబాట పట్టడంతో.. ఢిల్లీ వర్గాల్లో ఒక రకమైన చర్చ నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లో బిజెపి పట్టు బిగిస్తోందన్న కామెంట్స్ ప్రారంభమయ్యాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Cm jagan sudden tour of delhi what is happening
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com