The Rameshwaram Cafe
The Rameshwaram Cafe: అది రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్. ఎప్పుడు చూసినా జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. కొన్నిసార్లు క్యూలో గంటలకొద్దీ నిల్చోవాల్సిన పరిస్థితి పరిస్థితి. అలాగని అక్కడేమన్నా ప్రత్యేకమైన పదార్థాలు దొరుకుతాయా అంటే అదీ లేదు. కేవలం ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరీ, మైసూర్ బోండా వంటివే ఉంటాయి. రోజుకి ఏడు వేల మందికిపైగా అల్పాహారం వడ్డిస్తున్న ఆ హోటల్ ఆదాయం ఎంతో తెలుసా… నెలకి నాలుగున్నర కోట్లపైమాటే. మరి ఆ హోటల్ ఎక్కడుందు.. ఎందుకు అంత ఆదాయం వస్తుందో తెలుసుకోవాలంటే బెంగళూరులోని ‘రామేశ్వరం కెఫె’కి వెళ్లాల్సిందే.
రెండేళ్ల క్రితం ప్రారంభం..
చిన్న కిరాణాకొట్టు సైజులో 2021లో ఈ హోటల్‌ను ప్రారంభించారు బెంగళూరుకు చెందిన దివ్య, రాఘవేంద్రరావు దంపతులు. వాళ్లకి అబ్దుల్ కలాం దైవంతో సమానం. అందుకే హోటల్‌కు ఆ మహనీయుడు పుట్టి పెరిగిన రామేశ్వరం పేరు ఎంచుకుని ’రామేశ్వరం కెఫె’గా నామకరణం చేశారు.
సమయం వృథా కాకుండా..
సమయం ఎవరికైనా విలువైందే… అందుకే వినియోగదారుల సమయం వృథా చేయకుండా వీలైనంత త్వరగా వడ్డించే పద్ధతి పెట్టుకున్నారు దివ్య, రాఘవలు. రుచిలోనూ, నాణ్యతలోనూ రాజీ పడకూడదని ఫ్రిజ్ కూడా వాడరు. ఇడ్లీ– దోశ పిండి– చట్నీ లాంటి వాటిని ప్రతి అరగంటకోసారి రుబ్బే ఏర్పాటు ఉందక్కడ.
ప్లాస్టిక్ కనిపించదు…
ఆ హోటల్లో ప్లాస్టిక్ వస్తువు కనిపించదు. వడ్డించే ప్లేటు నుంచి పార్శిళ్ల వరకు స్టీలువే వాడతారు. పండుగ, ప్రత్యేక సందర్భాల్లో
దక్షిణ భారతదేశ ప్రసాదాలను వడ్డిస్తారు. కాంబో రూపంలో దొరికే ఈ ప్రసాదాలకోసం అభిమానులు పెద్ద సంఖ్యలో వెళుతుంటారు.
జాతీయ గీతాలాపనతో మొదలు..
ప్రతిరోజూ జాతీయగీతం ఆలపించాకే సిబ్బంది వంటగదిలో అడుగుపెడతారు. రుచీ, శుచీ పాటిస్తామని ప్రమాణం చేశాకే పనులు మొదలు పెడతారు. తక్కువ ధరకే ఆహారం అందిస్తున్న రామేశ్వరం కెఫె రుచి గురించి ఏడాది తిరిగే సరికి కేవలం నోటి ప్రచారంతోనే నగరమంతా తెలిసింది. అందుకే ఉదయం, సాయంత్రం వేళ అయితే కస్టమర్లు బారులు తీరి ఉంటారు.
కస్టమర్ల సలహాలు తీసుకుంటూ
అలానే నెట్‌లో హోటల్ గురించి వచ్చే రివ్యూలనూ చదువుతూ… కస్టమర్ల సలహాలూ సూచనలూ పాటించే ఈ దంపతులు– తాము సరిదిద్దుకోవాల్సినవి ఏమైనా ఉంటే వెంటనే సరి చేసుకుంటారు.
దిగవ మధ్యతరగతలి కుటుంబం నుంచి..
ఈ మధ్యనే రెండుమూడు బ్రాంచీలను కూడా ఏర్పాటు చేసిన దివ్య రాఘవు కథ సినిమా స్టోరీని తలపిస్తుంది. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివ్య సీఏ పూర్తి చేసి ఆడిటర్‌గా స్థిరపడింది.
ప్రొఫెసర్ మాటలను చాలెంజ్‌గా తీసుకుని..
కొన్నాళ్లకు అహ్మదాబాద్ ఐఐఎంలో పీజీ చేయడానికి వెళ్లింది. అక్కడ ఒక ప్రొఫెసర్… మెక్ డోనాల్డ్స్, స్టార్బక్స్, కేఎఫ్సీ విజయగాథలు చెబుతూ ’ఇండియన్స్ వేస్ట్.. ఇలాంటి ఇంటర్నేషనల్ ఫుడ్‌ను ఒక్కదాన్నీ సృష్టించలేకపోయారు’ అన్నాడు. ఆ మాటలు దివ్యకు చివుక్కుమనిపించాయి. దక్షిణ భారత వంటకాలతో ఓ బ్రాండ్ను ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగింది. సరిగ్గా అదే సమయంలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యాడు రాఘవ. నిరుపేద కుటుంబానికి చెందిన రాఘవకు ఫుడ్ బిజినెస్ అంటే ఆసక్తి. మెకానికల్ ఇంజినీరింగ్ చదివినా అనుభవం కోసమని హోటళ్లలో కప్పులు కడగడం నుంచి కూరగాయలు కోయడం వరకూ చిన్నాచితకా పనులు చేశాడు. అక్కడే కౌంటర్ బాయ్, క్యాషియర్గా, మేనేజర్‌గానూ కొన్నాళ్లు ఉన్నాడు. కొంతకాలానికి స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన ఫుడ్ కోర్ట్ నడిపించి నష్టపోయాడు. అందుకు సంబంధించి సలహాలకోసం దివ్యను కలిశాడు. ఆమెతో మాట్లాడాక ‘ఈ అమ్మాయి వ్యాపార భాగస్వామి అయితే బాగుంటుంది’ అనుకుని ఆమె ముందు అదే ప్రపోజల్ పెట్టాడు రాఘవ.
ఇంట్లో ఒప్పుకోకపోయినా..
అయితే హోటల్ వ్యాపారానికి దివ్య ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు. కష్టపడి చదివిస్తే దోశలు అమ్ముకుంటావా అన్నారు. కానీ ఐఐఎంలో భారతీయుల్ని కించపరిచిన ప్రొఫెసర్ మాటలు గుర్తొచ్చి రాఘవతో కలిసి రామేశ్వరం మొదలు పెట్టింది దివ్య. కలిసి వ్యాపారం చేస్తూ కోట్ల సంపాదనతో ముందుకెళ్లడమే కాదు… జీవితంలోనూ ఎందుకు కలిసి ఉండకూడదు అనుకున్న దివ్య– రాఘవలు గతేడాదే పెళ్లి చేసుకున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Interesting facts about the rameshwaram cafe
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com