Khasi And Garo Tribes: ఆడపిల్ల… పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తోంది. మహిళా సాధికారత దిశగా సాగుతోంది. నేల నుంచి ఆకాశం వరకు పురుషుడికి తాము ఎక్కడా తీసిపోము అన్నట్లుగా పోటీ పడుతోంది. అయినా వివక్ష కొనసాగుతూనే ఉంది. పురుషాధిక్యత కొనసాగుతోంది. ఇప్పటికీ కొడుకు పుట్టగానే కుటుంబంలో సంబరాలు చేసుకుంటారు. ఆడ బిడ్డ పుట్టగానే అయ్యో ఆడపిల్లా.. అని ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండవు. అయితే అక్కడ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ ఆడపిల్ల పుడితే సంబరాలు చేసుకుంటారు. ఆస్తి ఆడపిల్ల పేరిటే రాస్తారు. పెళ్లి జరిగితే అబ్బాయి అత్తారింటికి వస్తారు. అంతర్జాతీయ మహిళా దిన్సోవం సందర్భంగా ఆడపిల్లకు అంతటి గౌవరం దక్కే ఆ ప్రాంతం ఎక్కడుందో తెలుసుకుందాం..
భారత్‌లోనే..
భారత్ పురుషాధిక్య సమాజం. పిత్రుస్వామ్య దేశం. దశాబ్దాలుగా ఈ వ్యవస్థ కొనసాగుతోంది. అయితే ఇందుకు భిన్నంగా భారత దేశంలోనే ఉన్నారు వారు. మేఘాలయలోని ఓ గిరిజన తెగ పితృస్వామ్యానికి వ్యతిరేకంగా మాతృస్వామ్యం కొనసాగుతోంది. అయితే గిరిజన తెగ అనగానే వెనుకబడిన వాళ్లు, అమాయకులు, బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు అనుకుంటాం. కానీ మేఘాలయ రాష్ట్రంలోని గిరిజన తెగను చూస్తే ఆ అభిప్రాయం మార్చుకుంటారు. ఆ తెగ ఆచారాలు, సంప్రదాయాలు ఇతర సమాజానికి స్ఫూర్తినిస్తాయి. మనమే వెనుకబడ్డాం అన్న అభిప్రాయానికి వస్తాం.
ఆ తెగలో ఆడపిల్లకే పట్టం..
మేఘాలయలోని ఖాసీ, గరో అనే తెగలు మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చాయి. మేఘాలయలోని జైంటియా అనే పర్వత ప్రాంతంలో స్థిరపడ్డారు. ఈ తెగలు దశాబ్దాలకు పూర్వమే కొన్ని నియమాలు, పద్ధతులు పెట్టుకున్నారు. వాటినే ఇప్పటికీ ఆచరిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ తెగల్లో ఆడపిల్ల పుడితే వేడుకగా సెలబ్రేట్ చేస్తారు. ఆడపిల్లకే పట్టం కడతారు. పెత్తనం అంతా ఆడపిల్లలదే. ఆడపిల్లలకే ఆస్తి అప్పగిస్తారు. ఆఖరికి ఆడపిల్లకు పెళ్లి చేస్తే ఆమె అత్తారింటికి వెళ్లదు. వరుడే ఇల్లరికం వస్తాడు.
ఇతరులను చేసుకుంటే..
అయితే ఈ రెండు తెగల అమ్మాయిలు ఆ తెగ అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే వారి ఆచార, సంప్రదాయాలు, కట్టుబాట్లు వర్తిస్తాయి. ఇతర తెగల అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇవేవీ వర్తించవట. ఇక అక్కడి కుటుంబాల్లో ఒకరికి మించి ఆడిపిల్లలు ఉంటే చిన్న కూతురు మినహా మిగతా అందరూ భర్తతో కలిసి అదే ఇంట్లో ఉండొచ్చు. చిన్న కూతురును ఖథూగా పరిగణిస్తారు. ఆ అమ్మాయికి పెళ్లి తర్వాత ఇంటి బాధ్యతలు, ఆస్తిపాస్తులు అప్పగిస్తారు. తల్లి మరణం తర్వాత ఇంటి బాధ్యతలను నిర్వర్తించాల్సింది కూడా ఆమెనే.
ఆడవాళ్లదే అధిపత్యం..
పుట్టే పిల్లలకు భర్త ఇంటిపేరును మన దేశంలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇక ఈ తెగల్లో అమ్మాయిలకు పుట్టే పిల్లలకు అమ్మాయిల ఇంటిపేరే పెడతారు. పిల్లల పోషణ, బాధ్యతలు నిర్వర్తించే విషయంలో కూడా ఆడవాళ్లకే ఎక్కువ హక్కులు ఉంటాయి. ఈ తెగల మహిళలు వ్యవసాయంలో, ఇతర ఉద్యోగాల్లో రాణిస్తారు. అక్కడ గృహహింస, అత్యాచారాలు, వేధింపులు ఉండవు.
సమానత్వం కోసం పురుషుల పోరాటం..
మరో విచిత్రం ఏంటంటే భారత దేశంలో మహిళలు సమాన హక్కుల కోసం పోరాడుతుంటే మేఘాలయలోని ఖాసీ, గరో తెగల పురుషులు తమకు స్త్రీలతో సమాన హక్కులు ఉండాలని పోరాడుతున్నారు. 1990 నుంచి ఓ స్వచ్ఛంద సంస్థ నిరంతరం ఇందుకు కృషి చేస్తుంది. ఇలాంటి ఆచారం 20వ శతాబ్దానికి పూర్వమే కేరళలోని నాయర్ తెగలో కూడా ఉండేదట.