
PM Modi Hyderabad Tour: తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. కొద్ది నిమిషాల క్రితం మోదీ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో దిగారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం సన్మానం చేయవలసింది తెలంగాణ సీఎం కేసీఆర్. మోదీ పర్యటనకు ఆయన దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే సభా వేదికపై మోదీ కుర్చీ పక్కనే ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ కుర్చీ ఏర్పాటు చేశారు.
రైల్వే స్టేషన్ నునరాభివృద్ధికి శంకుస్థాపన..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అంతకుముందు సికింద్రాబాద్, తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించారు. 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించారు. తర్వాత బహిరంగ సభకు పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. ఇది రాజకీయ కార్యక్రమం కాదు కాబట్టి, తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాని మోదీతో వేదికను పంచుకోవడం లేదు. ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం కావడంతో ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, స్థానిక ఎంపీ తదితర ప్రముఖులకు సీటింగ్ ఏర్పాట్లు చేశారు.
మోదీ కుర్చీ పక్కనే..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటారని పీఎంవోకు తెలిసినా వేదికపై ప్రధాని పక్కనే సీఎం కేసీఆర్ కుర్చీని రిజర్వ్ చేశారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి కూడా కుర్చీ కేటాయించారు. ప్రోటోకాల్ ప్రకారం, ప్రధానమంత్రి వేదికపైకి రాకముందే, ఇతర ప్రముఖులు తమ రిజర్వు చేసిన కుర్చీలను ఐదు నిమిషాల ముందుగానే కూర్చోవాలి. వచ్చిన తర్వాత, కుర్చీ ఇంకా ఖాళీగా ఉంటే, అది వేదికపై నుంచి తీసేస్తారు.

డిమాండ్లు అడిగే అవకాశం కోల్పోయిన సీఎం
రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, తెలంగాణపై వివక్ష చూపుతోందని పదే పదే ఆరోపిస్తున్న సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా అనేకసార్లు మోదీని విమర్శించారు. పలు డిమాండ్లను వివరించారు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ అధికారిక పర్యటనకు వచ్చారు. ఈ సభావేదికగా మోదీని కేసీఆర్ డిమాండ్లు అడిగే అవకాశం ఉంది. ఇటీవల తమిళనాడుకు వెళ్లిన ప్రధాని మోదీకి అక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్ స్వాగతం పలకడంతోపాటు వేదికపైనే తమకు కావాల్సిన డిమాండ్లు, కేంద్రం సహకారాన్ని కోరారు. ఇప్పుడు కేసీఆర్‌కు అలాంటి అవకాశం వచ్చింది. కానీ దానిని తెలంగాణ ముఖ్యమంత్రి చేజేతులా జారవిడుచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, తమిళనాడు సిఎం ఎంకె.స్టాలిన్ కేంద్రంతో విభేదాలు ఉన్నా తమ తమ రాష్ట్రాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పరిష్కరించాల్సిన సమస్యలు, కొత్త ప్రాజెక్టుల విషయంలో తమ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. కేసీఆర్ మాత్రం అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలకంటే తన పంథమే ముఖ్యమన్నట్లు వ్యవహరించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.