Homeట్రెండింగ్ న్యూస్HIV Positive Matrimony: పాజిటివ్‌ పెళ్లిళ్లు.. ఎయిడ్స్ రోగులకు దగ్గరుండి వివాహం!

HIV Positive Matrimony: పాజిటివ్‌ పెళ్లిళ్లు.. ఎయిడ్స్ రోగులకు దగ్గరుండి వివాహం!

HIV Positive Matrimony: హెచ్‌ఐవీ.. ఎయిడ్స్‌.. ఏటా ఈ వ్యాధి నివారణకు ఒక డే నిర్వహించుకుంటున్నాం. ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఆరోజు తప్ప మిగతా రోజుల్లో ఈ పేర్లు పలికేందుకు కూడా చాలా మంది ఇబ్బంది పడతారు. పేషెంట్‌ కనిపిస్తే దగ్గరకు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది ఆ రోగంతో బాధపడుతోన్న రోగికి మరో రోగి భాగస్వామి అయితే ఆ జంట మరికొంతకాలం సంతోషంగా జీవిస్తారని భావించిన అనిల్‌ వాలివ్‌ అలాంటి వారికి దగ్గరుండి మరీ పెళ్లి సంబంధాలు కుదురుస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నాడు.

స్నేహితుడి మరణంతో..
పుణేకు చెందిన 50 ఏళ్ల అనిల్‌ వాలివ్‌ ప్రస్తుతం డిప్యూటీ రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అధికారి(ముంబై)గా పనిచేస్తున్నాడు. 2005లో అనిల్‌కు ఎంతో ఇష్టమైన స్నేహితుడు హెచ్‌ఐవీ సోకి తన కళ్లముందే చనిపోయాడు. అతని కొడుకుకి కూడా హెచ్‌ఐవీ సోకడం అనిల్‌ను ఎంతో బాధించింది. తన స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక… హెచ్‌ఐవీ వచ్చినంత మాత్రాన అంతటితో జీవితం అయిపోదు. వాళ్లకు భాగస్వామి ఉంటే జీవితం మరికొన్నాళ్లపాటు బావుంటుంది అన్న ఉద్దేశ్యంతో 2005లో పాజిటివ్‌ సాథి వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ప్రారంభంలో తన పైఅధికారులు కూడా ప్రోత్సహించడంతో వెబ్‌సైట్‌తోపాటు.. వివాహ వేదికలూ నిర్వహించేవాడు. అలా మొదలైన పాజిటివ్‌ సాథీ డాట్‌కామ్‌ క్రమంగా విస్తరించి నేడు వేలమంది పాజిటివ్‌ రోగుల పెళ్లిళ్లకు వారధిగా నిలుస్తోంది.

బ్రెయిన్‌ సర్జరీ అయినప్పటికీ..
ఒకపక్క ఉద్యోగం… మరోపక్క సామాజిక సేవచేస్తోన్న అనిల్‌కు 2015లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో సర్జరీ చేయించుకున్నాడు. పూర్తిగా కోలుకున్న తరువాత కూడా సామాజిక సేవలో మరింత మునిగి పోయాడు. తాను చేసే సాయం సమాజం మెరుగుపడడానికి ఉపయోగపడాలని నిర్ణయించుకుని హెచ్‌ఐవీ రోగులకు పెళ్లి సంబంధాలు కుదర్చడాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నాడు. హెచ్‌వీ రోగికి మరో హెచ్‌ఐవీ జతను జోడిస్తూ ఇప్పటిదాకా వేల మంది పెళ్లిళ్లకు సాయపడుతూనే ఉన్నాడు.

అంటరానివారిగా చూడడం..
ఆర్టీవో అధికారిగా అనేకమందిని కలుస్తుంటాడు అనిల్‌. ఒకరోజు రహదారి భద్రత, ట్రాఫిక్‌ నియమాల గురించి వస్తువులు రవాణా చేసే డ్రైవర్‌లకు ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ట్రక్కు డ్రైవర్లలో దాదాపు అందరు హెచ్‌ఐవీ సోకిన వారే అని తెలిసింది. హెచ్‌ఐవీ అని తెలియగానే.. కుటుంబ సభ్యులు, చుట్టాలు, స్నేహితులు అంటరానివారుగా చూస్తూ, తమని వదిలేశారని అనిల్‌కు కన్నీటితో తమ బాధను వెళ్లబోసుకున్నారు డ్రైవర్లు. ముందు నుంచి హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉన్న వ్యక్తులపై ఉన్న సానుభూతితో…హెచ్‌ఐవీ సోకిన డ్రైవర్ల జాబితా తీసుకుని డాక్టర్ల దగ్గరకు వెళ్లి వారికి ట్రీట్మెంట్‌ అందించాలని కోరాడు. కొంతమంది ముందుకు రావడంతో వాళ్లతో డ్రైవర్లకు వైద్యం అందిస్తూ సామాజిక కౌన్సెలింగ్‌ను అందిస్తున్నాడు. వీరిలో ఆసక్తి ఉన్నవారికి జతను వెదికిపెడుతున్నాడు.

ఇలాంటి సైట్‌ ఎక్కడా కనిపించక..
పాజిటివ్‌ అమ్మాయిలకోసం ఎన్ని మ్యాట్రిమొనీ సైట్లు వెతికినా ఎక్కడా హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉన్నవారికి సంబంధాలు చూసే సైటు ఒక్కటీ కనిపించలేదు. దీంతో తానే స్వయంగా సైటుని ప్రారంభించాలనుకున్నాడు. ఇందుకోసం ఆసుపత్రులలోని హెచ్‌ఐవీ రోగుల డేటాను సేకరించాడు. వారి అనుమతితోనే పాజిటివ్‌ సాథి డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సైట్‌లో కొన్ని వేలమంది తమ జతకోసం రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇప్పటిదాకా 3 వేలమందికిపైగా ఈ సైట్‌ ద్వారా వివాహం చేసుకున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular