
India Vs Australia Chennai: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఓ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ టాస్ గెలిచిన టీమే మ్యాచ్‌లో విజయం సాధిస్తూ వస్తోంది. ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్‌లలో ఇదే ఫలితం వచ్చినట్లు రికార్డ్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా టాస్ ఓడిపోవడం కలవరపెడుతోంది. భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరి, వన్డే సిరీస్‌లో కీలకమైన మ్యాచ్ చెన్నైలోని చెపాక్ వేదికగా బుధవారం జరుగుతుంది. ఈ వన్డే సిరీస్‌లో ఇప్పటికే చెరోమ్యాచ్ గెలిచి రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. మూడు వన్డే విజేతను నిర్ణయిస్తుంది. ఈ కీలకమైన ఈ డె అండ్ నైట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయారు. దీంతో టీమిండియా అభిమానుల్లో మ్యాచ్‌కు ముందే చిన్న అనుమానం మొదలైంది. చెన్నై సెంటిమెంట్‌ను టీమిండియా మార్చాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
స్పిన్ పిచ్..
చెన్నైలోని చెపాక్ స్టేడియం పూర్తిగా స్పిన్ పిచ్. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు విజృంభించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా భారత స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భారత అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా భారత స్పిన్నర్లు దీటుగానే ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుందని భావిస్తున్నారు.
స్పిన్నర్లు మ్యాజిక్ చేస్తే..
బోర్డర్ – గవాస్కర్ టోర్నీలో భారత స్పిన్నర్లు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. రవీంద్రజడేజా, అక్షర్ పటేల్ రాణిస్తున్నారు.
స్పిన్‌కు అనుకూలమైన చెపాక్ పిచ్‌పై వీరిద్దరూ రాణిస్తే ఆస్ట్రేలియాను కట్టడి చేయడం ఈజీ అన్న అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఐపీఎల్‌లో రవీంద్రజడేజా చెన్నై జట్టుకు ఆడుతున్నాడు. చెన్నై పిచ్‌లపై ఆయనకు మంచి పట్టు ఉండడం కలిసి వచ్చే అంశం.

సిరీస్ గెలవాలని ఇరు జట్ల ఉబలాటం..
ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలతో ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. టీ20, టెస్ట్ సిరీస్‌లు భారత ఖాతాలో జమయ్యాయి. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌ను అయినా గెలిచి స్వదేశానికి వెళ్లాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. మరోవైపు టీమిండియా సైతం వన్డే సిరీస్‌ను గెలిచి బోర్డర్ – గవాస్కర్ టోర్నీలో అన్ని సిరీస్‌లు గెలిచి ఆస్ట్రేలియాను ఉత్తచేతులతో వాళ్ల దేశానికి పంపించాలని భావిస్తోంది. పూర్తిగా స్పిన్ పిచ్‌పై ఇరుజట్లు ఎలా ఆడతాయో.. ఎవరి ఆకాంక్ష నెరవేరుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.