
Digital Payments: పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీల చెల్లింపులకు ఇబ్బందులు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చిల్లర సమస్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ లావాదేవీలను కేంద్రం ప్రోత్సహించింది. ఈ క్రమంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) అమలులోకి వచ్చింది. తర్వాత పలు ప్రైవేటు యాప్స్ గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, భారత్‌పే తదితరాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ పేమెంట్ విప్లవం ఐదేళ్లలో దేశమంతా విస్తరించింది. ఈ క్రమంలో భారత్ ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ హద్దులు చెరిపేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌సేఫ్(యూపీఐ)ని సింగపూర్‌కి చెందిన ‘పేనౌ’ మధ్య సరిహద్దు కనెక్టివిటీని ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సింగపూర్ కౌంటర్ లీ హ్సీన్ లూంగ్ ఈ అనుసంధానాన్ని మంగళవారం ప్రారంభించారు.
ఇక రెండు దేశాల మధ్య డిజిటల్ లావాదేవీలు..
ఇన్నాళ్లూ మన దేశంలో చెల్పింపులకే పరిమితమైన డిజిటల్ పేమెంట్స్ ఇకపై అంతర్జాతీయ స్థాయిలో ఈజీగా జరుగనున్నాయి. భారత్, సింగపూర్ కనెక్టివిటీ ఇందుకు ఉపయోగపడనుంది. రెండు దేశాల్లో నివాసం ఉంటున్నవారు ఈజీగా లావాదేవీలు సాగించవచ్చు.
వ్యాపారాభివృద్ధికి తోడ్పాటు..
ఫిన్‌టెక్ ఆవిష్కరణల కోసం భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా అవతరించింది.
భారతదేశం యొక్క డిజిటల్ చెల్లింపు మౌలిక సదుపాయాల ప్రపంచీకరణను నడపడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది. ఇండియాతోపాటు ఇతర దేశాలతో కూడా ప్రయోజనం పొందడంపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే సింగపూర్‌లోని భారతీయ ప్రవాసులకు, ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులకు సౌకర్యం కోసం సింగపూర్ నుంచి భారతదేశానికి తక్షణం, తక్కువ ఖర్చుతో డబ్బు బదిలీ చేయడానికి యూపీఐ, పేనౌ అనుసంధానం దోహదపడనుంది.

డిజిటల్ పేమెంట్స్ పెరిగేలా..
ఇండియా సింగపూర్ మధ్య నగదు లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిని గుర్తించిన ఆర్‌బీఐ నగదు లావాదేవీలను సులభతరం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా డిజిటల్ రూపంలో నగదు బదిలీ జరగాలని నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయంతోపాటు చెల్లింపుల చార్జీలు తగ్గుతాయని భావించి ఇంటర్‌నేషనల్ డిజిటల్ చెల్లింపులకు ప్రతిపాదన చేసింది. ఎట్టకేలకు ఇది కార్యరూపం దాల్చింది.
ఫిబ్రవరి 8 నుంచి అమలు..
సింగపూర్‌తో పూర్తిగా డిజిటల్ చెల్లింపు జరుగడంతోపాటు 20 దేశాల అంతర్జాతీయ విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులకు ఈ డిజిటల్ పేమెంట్స్ విధానం అందుబాటులోకి తెచ్చారు. దీంతో నగదు బదిలీ, చెల్లింపులు ఇక సులభంగా జరుగుతాయని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు.