
India Vs Australia- Modi And Albanese: బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్–ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక చివరి ‘టెస్ట్’ గురువారం అహ్మదాబాద్‌లోని ప్రధాని నరేంద్రమోదీ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తిలకించేందుకు ఇరు దేశాల ప్రధానులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 75 ఏళ్ల భారత్–ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ తొలి రోజు ఆట చూసేందుకు మైదానానికి వచ్చారు. ఇద్దరు ప్రధానులకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రెటరీ జైషా ఘన స్వాగతం పలికారు. ప్రధానులిద్దర్నీ ఘనంగా సత్కరించారు. మోదీకి జైషా ఆయన ఫొటోతో కూడిన జ్ఞాపికను అందజేయగా.. ఆల్బనీస్‌కు బిన్నీ ఆయన ఫొటోతో ఉన్న జ్ఞాపికను ఇచ్చారు.
ఫ్రెండ్‌షిప్ ఇలానే..
అనంతరం ఇద్దరు ప్రధానులు తమ కెప్టెన్లకు టెస్ట్ క్యాప్ అందజేశారు. ప్రధాని మోదీ భారత కెప్టెన్ రోహిత్ శర్మకు టెస్ట్ క్యాప్ ఇవ్వగా.. స్మిత్‌కు ఆల్బనీస్ అందజేశాడు. వెంటనే మోదీ స్మిత్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆసీస్ ప్రధానితోపాటు రోహిత్ శర్మ చేతులను పైకెత్తి తమ స్నేహం ఇలానే కొనసాగాలని చాటిచెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు దేశాల ప్రధానులు బంగారు పూత పూసిన గోల్ఫ్ కారులో స్టేడియం మొత్తం తిరిగి అభిమానులకు అభివాదం చేశారు.
ఫొటో గ్యాలరీ..
నరేంద్ర మోదీ టాస్ కాయిన్ ఎగరవేస్తాడని ప్రచారం జరిగినా.. ప్రధానులు ఆటలో భాగమవ్వలేదు. మైదానంలో తిరిగిన అనంతరం స్టేడియం లోపలి నిర్మాణాలను పరిశీలించారు. టీమిండియా సాధించిన విజయాలతోపాటు మైదానం లోపల ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీలను తిలకరించారు. మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. ఇరు దేశాల ప్రధానులకు ఆ ఫొటోల వివరాలను వివరించాడు. టాస్ అనంతరం ఇరు దేశాల ఆటగాళ్లతో ప్రధానులు మైదానంలోకి వచ్చి జాతీయా గీతాలను ఆలపించారు. ప్రధాని నరేంద్రమోదీ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా నిలబడ్డారు. జాతీయ గీతాలపన అనంతరం ఇరు దేశాల ప్రధానులు ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.

టాస్ ఓడిన రోహిత్‌శర్మ..
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ ఫ్లాట్‌గా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆసీస్ తాత్కలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పిన స్మిత్.. గత మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని గుర్తు చేశాడు.
టీమిండియాలో ఒక మార్పు..
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఏం చేయాలో తమకు తెలుసని, తుది జట్టులో ఒక మార్పు చేశామని రోహిత్ వెల్లడించాడు. సిరాజ్‌కు విశ్రాంతివ్వగా.. మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. గత మ్యాచ్ ఓటమి అనంతరం తాము సమావేశమై తమ లోపాలపై చర్చించుకున్నామని చెప్పాడు. గత మూడు మ్యాచ్‌ల్లో పిచ్ ఒక్కటే ఫలితాలను శాసించలేదని, చాలా అంశాలున్నాయని చెప్పాడు రోహిత్. ఈ పిచ్.. ఐదు రోజులు ఒకేలా ఉంటుందని ఆశిస్తున్నానని తెలిపాడు.
The Honourable Prime Minister of India, Shri Narendra Modiji presents the special cap to #TeamIndia captain @ImRo45 while The Honourable Prime Minister of Australia, Mr Anthony Albanese presents the cap to Australia captain Steve Smith.@narendramodi | @PMOIndia | #INDvAUS pic.twitter.com/8RH70LOx0v
— BCCI (@BCCI) March 9, 2023