
Variety Marriage: అమ్మాయిలు లేక.. ఉన్నా వారికి వేరే ఇంట్రస్ట్ లు ఉండి.. అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకి రావడం లేదు. దీంతో 35 ఏళ్ళు వచ్చినా పెళ్ళి కావడం లేదు. అందుకే పెళ్లి కాని ప్రసాద్ ల సంఖ్య పెరిగి పోతోంది. కొన్ని చోట్ల కన్యాశుల్కం వంటివి జరు గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడు ఇద్దరి అమ్మాయిలను లైన్ లో పెట్టాడు. ప్రేమించాడు. పెళ్లి కాకుండానే ఇద్దరితో సంసారం చేశాడు. ఇద్దర్నీ తల్లులను చేశాడు. ఇప్పుడు ఒకే వేదిక పై ఇద్దర్నీ మనువాడనున్నాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామంలో గురువారం అరుదైన వివాహం జరగనుంది. ఓ యువకుడు ఒకేసారి ఇద్దరు గిరిజన యువతులను వివాహం చేసుకోనున్నాడు. ఈ పెళ్లి శుభలేఖ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం పొందడంతో ప్రస్తుతం జిల్లాలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. చర్ల మండలం ఎర్రబోడు గ్రామానికి చెందిన మడివి సత్తిబాబు అనే యువకుడు డిగ్రీ చదువుకునే క్రమంలో ఇదే మండలంలోని దోసిల్లపల్లి గ్రామానికి స్వప్నకుమారి, కున్నాపల్లి గ్రామానికి చెందిన సునీతలను ప్రేమించాడు. ఈ క్రమంలో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగించాడు. ఈ విషయం ఆయా కుటుంబాల పెద్దలకు తెలియడంతో గొడవలు జరిగాయి. తరువాత మూడు కుటుంబాల సభ్యులు కూర్చొని మాట్లాడుకొని వారి ముగ్గురికీ వివాహం చేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో గత కొంతకాలంగా ఆ ముగ్గురు సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం గిరిజన సంప్రదాయం ప్రకారం సత్తిబాబు ఇద్దరు యువతులను ఎర్రబోరు గ్రామంలో వివాహం చేసుకోనున్నాడు. ఇదిలా ఉండగా సత్తిబాబుతో సహజీవనం చేసిన యువతులిద్దరికీ చెరొక సంతానం కలిగినట్లు సమాచారం. కాగా ఈ పెళ్లికి సంబంధించిన శుభలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో జిల్లాలో ఎక్కడ చూసినా ఈ పెళ్లిపైనే చర్చ జరుగుతోంది. అమ్మాయిని ఇచ్చే వాడు లేక, సరయిన సమయం లో పెళ్లి కాక, ముందు పొట్ట, పైన బట్ట తో ఇబ్బంది పడుతున్న మహానుభావులు సత్తిబాబును చూసి కుళ్ళుకుంటున్నారు. అదృష్టం అంటే నీదేరా బాబూ అంటూ కామెంట్ చేస్తున్నారు.