Uttar Pradesh: అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది. బంధువులంతా వచ్చారు. లైటింగ్, పెళ్లి పందిరితో శోభాయమానంగా వాతావరణం ఉంది. కాసేపట్లో వరుడు వధువు మెడలో తాళి కట్టే ముహూర్తం ఉంది. ఇంతలో షాక్.. వరుడు పెళ్లికి రాలేదు అనే వార్త. అప్పటి వరకు ఉన్న ఆనందం ఆవిరైంది. కొందరు ఆందోళన చెందుతుండగా, కొందరు గుసగుసలాడుతున్నారు. ఏమైంది.. ఎందుకిలా జరిగిందని ఇంకొందరు చర్చించుకుంటున్నారు. అన్యాయాన్ని ఎలా ఎదుర్కొనాలని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో వధవు ఇచ్చిన ట్విస్ట్ అందరినీ మరింత షాక్‌కు గురిచేసింది.
ఏం జరిగిందంటే..
ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది. పెద్దలు పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 28న పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. వధువు ఇంటివద్ద ఘనంగా ఏర్పాట్లు చేశారు. బంధువులను పెళ్లికి ఆహ్వానించారు. అంతా సిద్ధమైంది. ముహూర్తానికి గంట ముందు వరుడు పెళ్లికి రావడం లేదని కబురు వచ్చింది. పెళ్లి ఇష్టం లేదని పెళ్లి చేసుకోనని తెలిపినట్లు కబురు పంపించారు.
వధువు సూపర్ ట్విస్ట్
అందరూ ఆందోళనలో మునిగిపోయారు. పందిట్లో సందడి పోయి నిశ్శబ్దం అలుముకుంది. కానీ వధువు కీలక సమయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. వెంటనే అతడికి కబురు పంపించింది. అతడు మండపానికి చేరుకోగానే జరిగింది చెప్పింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి వరుడి తమ్ముడు కూడా అంగీకరించాడు. ఇంకే ముందు అదే మండపంలో వరుడి తమ్ముడిని పెళ్లాడి అదే ఇంట్లో కోడలిగా అడుగు పెట్టింది.
రూ.51 వేల కోసమే..
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపారు. వధువు అక్కడి ప్రభుత్వం ఇచ్చే రూ.51 వేల కోసమే ఇలా చేసిందని విచారణలో గుర్తించారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్‌లోనే గతంలో ఓ యువతి వరుడు ప్రధాని పేరు చెప్పలేదని పెళ్లి రద్దు చేసుకుంది. వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకుంది. ఈ ఘటన ఘజియాబాద్ జిల్లాలో జరిగింది. తాజాగా వరుడు డుమ్మా కొట్టడంతో మ్యారేజ్ స్కీం డబ్బుల కోసం అతడి తమ్ముడిని పెళ్లి చేసుకుంది.