
Kalti Kallu On Mahabubnagar: తాగితే కిక్కు ఎక్కుతుంది.. తాగకుంటే పిచ్చి ఎక్కుతుంది.. అలాగని తాగకుండా ఉండలేని పరిస్థితి. ఆ వ్యసనమే వారి ప్రాణాల మీదకు తెచ్చింది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. 16 మంది రోజువారీ కూలీలను మృత్యువు అంచువరకూ తీసుకెళ్లింది. అమాత్యుడి ఇలాఖాలో కల్తీ కల్లు పాపం ఎవరిది? కల్లు మాఫియా రెచ్చిపోతుంటే మంత్రివర్యులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కూలీల ప్రాణాలతో చెలగాటం..
కల్తీ కల్లు మాఫియా మహబూబ్‌నగర్ జిల్లాలో కూలీల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. రసాయనాలతో కల్లు తయారుచేసి దానికి కూలీను బానిసలు చేస్తోంది. దీంతో అది తాకగుండా ఉండలేని పరిస్థితికి చేరుస్తోంది. తాజాగా ఈ కల్తీ కల్లు తాగి జిల్లాలో 16 మంది ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు. ఇందులో ఒకరికి మాట పడిపోయింది.. మరొకరికి మూతి వంకర పోయింది.. ఇంకొకరు ఫిట్స్ వచ్చినట్టు ఊగిపోయారు.. ఒకరి తర్వాత మరొకరు.. ఇలా 16 మంది వింత చేష్టలతో ప్రభుత్వాస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వీరంతా మహబూబ్‌నగర్ జిల్లాని దొడ్లోనిపల్లి, కోయనగర్, మోతీనగర్, తిమ్మసానిపల్లి, ఎనుగొండకు చెందినవాళ్లు. అందరూ కూలీలు.
రోజూ తాగాల్సిందే..
రసాయనాలతో తయారు చేస్తున్న కల్లుకు జిల్లాలోని రోజువారీ కూలీలు బానిసయ్యారు. చేసిన కష్టం మర్చిపోవడానికి సాయంత్రం కాగానే కల్లు తాగుతున్నారు. రోజులాగే కల్లు తాగారు. కానీ ఈసారి ఇంటికి వెళ్లలేదు. ఆస్పత్రిపాలయ్యారు. కల్లులో క్లోరోహైడ్రెడ్, అల్ఫాజోలం, డైజోఫాం లాంటి మత్తు పదార్థాలతో ఉపయోగిస్తున్నారు. మత్తు కోసం వీటి డోస్ పెంచడంతో కూలీలు పిచ్చెక్కిపోయినట్టు ప్రవర్తిస్తున్నారు. నాలుగైదు రోజులుగా చికిత్స అందిస్తున్నా కొంత మంది ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడం లేదు. 16 మంది బాధితులు ఆస్పత్రిలో చేరగా ముగ్గురి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.

మాఫియా ఆగడాలు అడ్డుకునేదెవరు
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సొంత జిల్లాలోనే కల్తీ మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు ఆస్పత్రిలో చేరాక.. తూతూ మంత్రంగా శాంపిల్స్ సేకరించారని మండిపడుతున్నారు. ప్రాణనష్టం జరగలేదు కనుక సరిపోయింది.. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
కల్తీ కల్లు వార్తలను ఖండించిన మంత్రి..
ఇదిలా ఉంటే జిల్లాలో కల్తీ కల్లు అమ్ముతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలు లేవని సర్దిచెప్పుకునే ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో ఎక్కడా కల్తీ కల్లు లేదని ప్రకటన చేశారు. మరోవైపు వైద్యులు మాత్ర కల్తీ కల్లు కారణంగానే దానిని తాగినవారు ఇలా ప్రవర్తిస్తున్నారని పేర్కొంటున్నారు. కల్లులో కలిపే రసాయనాల మోతాదు పెంచితే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. మంత్రి మాత్రం మాఫియాకు క్లీన్ చిట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.