Karanda Tree:: ఇంటికి గోడను రక్షణగా నిర్మిస్తాం. కానీ పంట పొలానికి రక్షణగా ఏం చేస్తాం? గోడను నిర్మించలేం కదా..ఏదైనా ముళ్ల కంపను వేస్తాం. అయితే ఓ రైతు ఊరికే కంప వేస్తే ఏం లాభం అని ముళ్లు ఉండే కొన్ని పండ్ల చెట్లను నాటాడు. అవి కొన్ని రోజుల తరువాత కాయలు కాశాయి. ఆ తరువాత రైతు సోదరుడు మంచి ఆలోచనతో వాటిని ప్రత్యేకంగా ఓ ఎకరంలో పంట వేశారు. అవి మంచి లాభాలు రావడంతో వాటిని 80 ఏకరాలకు విస్తరించాడు. ఇప్పుడు కోట్లలో లాభం రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ముళ్లు ఉండే ఈ చెట్లు ఏవి? వాటికి ఎలాంటి కాయలు కాస్తాయి? వీటికి ఎందుకంత డిమాండ్? వివరాల్లోకి వెళితే.
బాపట్ల జిల్లా కొరిశపాడు మండల కేంద్రానికి చెందిన కడవేటి జగన్నాథ రెడ్డి అనే రైతు కాశీకి వెళ్లినప్పడు కొన్ని మొక్కలు తీసుకొచ్చాడు. అవి వాక్కాయ మొక్కలు. వాక్కాయ గురించి కొంతమంది రైతులకు తెలుసుకావొచ్చు. కానీ చాలా మంది వీటిని చూసి ఉండరు. ఇవి కాసే చెట్లు ముండ్లతో కూడుకొని ఉంటాయి. జగన్నాథ రెడ్డి తన పంట పొలానికి రక్షణగా వీటిని నాటారు. ఇవి కాయాలు కాశాక జగన్నాథ రెడ్డి సోదరుడు విశ్వనాథ్ రెడ్డి తన పొలంలో ప్రధాన పంటగా 12 ఎకరాల్లో వేశాడు.
ఒక్కో ఎకరంలో 200 మొక్కలు నాటిన రైతు ఓ సంవత్సరం పాటు ఆగాడు. ఆ తరువాత ఒక్కో చెట్టు 25 నుంచి 30 కిలోల వాక్కాయల దిగుబడి వచ్చింది. ఇలా ఎకరానికి 5 నుంచి 6 టన్నులు ఉత్పత్తి అయ్యాయి. అడవి జాతి మొక్క కావడంతో చీడపురుగుల నుంచి తట్టుకొని నిలబడింది. అయతే పూత సమయంలో కొన్ని పురుగుల మందులు కొడితే ఎలాంటి నష్టం ఉండదని రైతు తెలుపుతున్నాడు. ఏడాదికి రెండు నుంచి మూడుసార్లు నీరందిస్తే సరిపోతుందని ఆయన అంటున్నాడు.
వాక్కాయకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. బేకరీల్లో ఉండే చెర్రీ పండ్లను వీటితోనే తయారు చేస్తుంటారు. ఈ రైతు గురించి తెలుసున్న చెర్రీ వ్యాపారులు తోటలోకి వచ్చే వాక్కాయలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.50 పలుకుతోంది. ఇక వాక్కాయను కేవలం చెర్రీ పండ్లకోసం మాత్రమే కాకుండా పచ్చళ్లల్లోనూ ఉపయోగిస్తున్నారు. చింతపండుకు ప్రత్యామ్నాయంగా వాక్కాయలను వాడుతారు. అందుకే వీటికి ఎక్కువగా డిమాండ్ ఉంది. అయితే కూలీల ఖర్చులతో లాభం తగ్గుతోందని, మిషనరీలు ఉంటే మంచి లాభాలు వస్తాయని రైతు విశ్వనాథ రెడ్డి అంటున్నాడు.