https://oktelugu.com/

Zolgensma Injection: ఆ పాప బతకాలంటే.. పదహారు కోట్ల ఇంజక్షన్ వేయాలి! అసలేమైందంటే?

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో రమణ కుమార్, జనని అనే దంపతులకు మూడు నెలల పాప ఉంది. ఆ పాప అరుదైన "మస్కులర్ డైస్ట్రోపీ" అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది.

Written By:
  • Rocky
  • , Updated On : October 1, 2023 / 03:10 PM IST

    Zolgensma Injection

    Follow us on

    Zolgensma Injection: అది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు. ఆ దంపతులు రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబ నేపథ్యానికి చెందినవారు. తమ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఒక పాప జన్మించింది. ఆ పాపకు ఇప్పుడు మూడు నెలలు మాత్రమే. తల్లిపాలు తాగుతూ, కేరింతలు కొడుతూ సందడి చేయాల్సిన ఆ పాప ఆసుపత్రిలో.. ఒక పేషెంట్ లాగా బెడ్ పై పడి ఉంది. నర్సులు గుచ్చుతున్న సూదులకు, డాక్టర్లు చేస్తున్న చికిత్సకు విలవిలలాడిపోతున్నది. చావు బతుకుల మధ్య పోరాటం చేస్తోంది. ఇంతకీ ఆ పాప బతకాలి అంటే అక్షరాల 16 కోట్లు ఖర్చు చేయాలి. ఆ 16 కోట్ల విలువైన ఇంజక్షన్ వేస్తేనే ఆ అమ్మాయి బతికి బట్ట కడుతుంది. ఇంతకీ ఆ అమ్మాయికి వచ్చిన అరుదైన వ్యాధి ఏంటంటే..

    తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో రమణ కుమార్, జనని అనే దంపతులకు మూడు నెలల పాప ఉంది. ఆ పాప అరుదైన “మస్కులర్ డైస్ట్రోపీ” అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి నుంచి ఆ పాపను కాపాడాలి అంటే 16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్ వేయాలి. “జోల్జెన్సా” గా పిలిచే ఈ ఇంజక్షన్ ను అమెరికా నుంచి తెప్పించాలి. అయితే అత్యంత ఖరీదైన ఈ ఇంజక్షన్ కొనలేని ఆ దంపతులు తమకు సహాయం చేసి బిడ్డ ప్రాణాలు కాపాడాలని కోయంబత్తూర్ కలెక్టర్, అధికారులను వేడుకుంటున్నారు. కాగా, తమ పాప చికిత్స కు అవసరమయ్యే నిధులను సమకూర్చుకునేందుకు “ఇంపాక్ట్ గురు” అనే యాప్ ద్వారా ప్రయత్నిస్తున్నారు.

    “మస్కులర్ డైస్ట్రోపీ”.. అనేది జన్యుపరమైన వ్యాధి. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి. కండరాలు బలహీనంగా ఉండడం, శరీరంలోని ఏదో ఒక అవయవంలో కదలికలు లేకపోవడం దీని ప్రధాన లక్షణం. చికిత్స తీసుకోకుంటే అనారోగ్యం తీవ్రమై మంచానికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాలు కూడా దక్కవు. అయితే ఈ వ్యాధికి చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది. ఈ వ్యాధిని నయం చేయాలంటే నోవార్టీస్ ఫార్మా తయారుచేసిన 16 కోట్ల విలువైన జోల్జెన్సా ఇంజక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన ఔషధం. ఇది మనదేశంలో దొరకదు. విదేశాల నుంచి తెప్పించుకోవలసి ఉంటుంది. అయితే బిడ్డ పుట్టిన రెండు సంవత్సరాల లోపే దీన్ని తీసుకోవాలి. ఇది అంత సులభంగా ఇవ్వరు. మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేదా పిల్లల వైద్యుడి నుంచి ఒక లేఖను పంపితే వారు పరిశీలించి, ఇంజక్షన్ ఇచ్చేందుకు అనుమతి ఇస్తారు. ఇప్పటికే ఇలాంటి కేసులు మన దేశంలో చాలానే వెలుగు చూశాయి. అయితే ప్రభుత్వాల నుంచి తోడ్పాటు లేకపోవడంతో విరాళాల ద్వారానే ఆ ఇంజక్షన్ తెప్పించుకొని తమ పిల్లల ప్రాణాలను తల్లిదండ్రులు కాపాడుకున్నారు. కాగా, “ఇంపాక్ట్ గురు” అనే యాప్ ప్రస్తుతం చిన్నారి ఇంజక్షన్ కోసం ఆన్లైన్ ద్వారా విరాళాలు సేకరించే పనికి నడుం బిగించింది.