
MLC Kavitha Arrested: రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో.. బీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరపాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. శుక్రవారం బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ, రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశాన్ని జరపనున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు.. రాష్ట్రవ్యాప్త నేతలంతా ఈ సమావేశానికి హాజరుకావాలని నిర్దేశించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, ఆమె అరెస్టవుతారన్న ప్రచారం నేపథ్యంలో ఆ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరవ్వాలంటూ బుధవారం కవితకు ఈడీ నోటీసు పంపిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె బుధవారమే ఢిల్లీకి వెళ్లారు. విచారణ అనంతరం ఆమెను ఈడీ అరెస్టు చేస్తుందన్న వార్తలు వెలువడుతున్నాయి.
ఆమె అరెస్ట్ అయితే..
కవిత అరెస్ట్ అయితే పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాదిలో ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపైన, పార్టీ కార్యకలాపాలు, ఇతర అంశాలపైన చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో పార్టీ పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీఎమ్‌ఎస్, డీసీసీబీ చైర్మన్లు పాల్గొననున్నారు. గురువారం నిర్వహించే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ కవిత అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఉద్యమ కార్యాచరణ
కవిత ను అరెస్ట్ చేస్తే బీఆర్‌ఎస్ పరంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను కూడా ఈ భేటీలో రూపొందించుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేస్తారని, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో పార్టీశ్రేణులను అప్రమత్తం చేయడంపై మంత్రులకు పలు సూచనలు చేస్తారని సమాచారం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఎండగడుతూ ఉద్యమించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చే అవకాశాలున్నాయి. అలాగే.. ప్రతిపక్ష పార్టీలు పరిపాలించే రాష్ట్రాలపై బీజేపీ ధోరణి ఎలా ఉంది, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తోందన్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఆదేశించవచ్చని సమాచారం. ఇప్పటికే కొంత మంది నేతలు హైదరాబాద్ వెళ్లారు. మరోవైపు కవిత నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.