
ICC ODI Rankings: చివరి వన్డేలో కంగారులు చేతిలో ఖంగుతిన్న భారత్ కు మరో షాక్ తగిలింది. చెన్నై వన్డే ఓటమి తో సిరీస్ ను కోల్పోయిన భారత్.. ఐసీసీ వన్డే టాప్ ర్యాంకును కోల్పోయింది. ఆస్ట్రేలియా చివరి వన్డే విజయంతో సిరీస్ గెలుచుకోవడంతోపాటు వన్డే టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది.
ఆస్ట్రేలియాతో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో ఓటమి పాలై సిరీస్ కోల్పోయిన భారత్ కు మరో షాక్ తగిలింది. గత కొద్ది నెలల నుంచి వన్డే ఫార్మాట్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. చివరి వన్డేలో భారత్ ఓటమిపాలైన తర్వాత వన్డే సిరీస్ కోల్పోవడంతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో కిందకు పడిపోయింది. ఈ మేరకు ఐసిసి ర్యాంకింగ్స్ ను బుదవారం విడుదల చేసింది. ఈ జాబితాలో చివరి వన్డేలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రెండో స్థానానికి భారత జట్టు దిగజారింది.
113 పాయింట్లు అయినప్పటికీ..
వన్డే ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 113 పాయింట్లు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ అదే పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. 111 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో కొనసాగుతుండగా, 111 పాయింట్లతో నాలుగో స్థానంలో ఇంగ్లాండ్ కొనసాగుతోంది. 106 పాయింట్లతో పాకిస్తాన్ 5వ స్థానంలో కొనసాగుతోంది.
టెస్టుల్లోనూ రెండో స్థానంలో భారత్..
ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ లోను భారత రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలోను ఆస్ట్రేలియా ప్రథమ స్థానంలోనే సాగుతూ ఉండడం గమనార్హం. 122 పాయింట్లు తో ఆస్ట్రేలియా ఈ జాబితాలో మొదటి ప్లేస్ ను ఆక్రమించగా, 119 పాయింట్లు తో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇకపోతే 106 పాయింట్లతో ఇంగ్లాండ్ మూడో స్థానంలోనూ, 104 పాయింట్లతో దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో, 103 పాయింట్లుతో న్యూజిలాండ్ 5వ స్థానంలో కొనసాగుతోంది.
అగ్ర స్థానంలో భారత్..
టెస్టు, వన్డేల్లో రెండో స్థానానికి పరిమితమైన భారత్.. టి20 ఫార్మాట్లో మాత్రం అగ్రస్థానంలో కొనసాగుతోంది. 267 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 261 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో, 258 పాయింట్లు తో పాకిస్తాన్ మూడో స్థానంలో, 256 పాయింట్లు తో సౌత్ ఆఫ్రికా నాలుగో స్థానంలోనూ, 252 పాయింట్లు న్యూజిలాండ్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి.

అగ్రస్థానంలో సూర్య కుమార్ యాదవ్..
ఇక వరుసగా వన్డేల్లో విఫలమవుతున్న సూర్య కుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో బ్యాట్స్మెన్ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 906 పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ మొదటి స్థానంలో ఉండగా, పాకిస్తాన్ కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ 836 పాయింట్లతో స్థానంలోనూ, 778 పాయింట్లు తో బాబర్ అజం మూడో స్థానంలో, 768 పాయింట్లతో న్యూజిలాండ్ కు చెందిన డేవాన్ కాన్వాయ్ నాలుగో స్థానంలో, 748 పాయింట్లు తో దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రం ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు.