
Dharani: ధరణి.. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సాఫ్ట్‌వేర్. భూ రికార్డుల సర్వే చేపట్టిన ప్రభుత్వం వాటిని ధరణి పోర్టల్‌లో నమోదు చేసింది. ఈ సమయంలో చాలామంది భూములు దారిమళ్లాయి. భూమే లేనివారి పేరిట భూములు వచ్చాయి. ఇక భూములు ఉన్నవారివి మాయమయ్యాయి. పోర్టల్ ప్రారంభించి మూడేళ్లు దాటినా ఇప్పటికీ రైతులు అధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తుండడం పోర్టల్‌లో లోపాలకు నిదర్శనం. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా, ధరని రద్దు చేయాలని డిమాండ్ వస్తున్నా కేసీఆర్ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా రద్దు చేసే ఆలోచన లేదని, లోపాలను సరిదిద్దుతామని మాత్రం ప్రభత్వం చెబుతోంది. గడిచిన మూడేళ్లలో ఎన్ని ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చిన ఇప్పటికీ వేల ఎకరాల భూమి రైతుల పేరిట రికార్డులకు ఎక్కలేదు.
డీఫాల్ట్ సంస్థకు సాఫ్ట్‌వేర్ తయారీ బాధ్యత..
తెలంగాణ ముఖ్యమంత్రి మానస పుత్రికగా అధికార బీఆర్‌ఎస్ నేతలు అభివర్ణిస్తున్న ధరణి సాఫ్ట్‌వేర్‌ను రద్దు చేయకపోవడం వెనుక పెద్ద దగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ధరణి వెనుక అతిపెద్ద స్కాం జరిగినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే తాజాగా సాఫ్ట్‌వేర్ తయారీ నుంచే దగా మొదలైందని తాజాగా సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ధరణి సాఫ్ట్‌వేర్ తయారీ బాధ్యతను కేసీఆర్ బ్యాంకులకు లక్షల రూపాయల ఎగ్గొట్టిన డీఫాల్టర్ కంపెనీకి క్వాంటెల్లాకు అప్పగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీ గతంలో అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కంపెనీ సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరుతో ఆర్థిక మోసాలకు పాల్పడిన సత్యం రామలింగరాజు బంధువుకు చెందిన శ్రీధర్ గాదిరాజుకు చెందిన చిన్న కంపెనీగా చెబుతున్నారు. ఈ కంపెనీకి ధరణి పోర్టల్ తయారీ, నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఆ కంపెనీకే ఎందుకు?
2018లో ధరణి పోర్టల్ సాఫ్ట్‌వేర్ అండ్ డెవలప్‌మెంట్ బాధ్యతను కేసీఆర్ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనుబంధ సంస్థ అయిన టెర్రాసిస్ టెక్నాలజీకి ప్రభుత్వం అప్పగించింది. అయితే ఈ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థ 2018 జూన్‌లో బ్యాంకులకు లక్ష కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది. ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే ఎన్‌ఐటీ, టీసీఎష్, ఇన్‌ఫోసిస్ సంస్థలు ఉన్నప్పటికీ డీఫాల్ట్ సంస్థలకే ఈ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సత్యం రామలింగరాజు బంధువుదని తెలిసి కూడా వివాదాస్పదమైంది. ఎందుకంత ప్రయారిటీ ఇచ్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు 2020 అక్టోబర్‌లో పోర్టల్ సామర్థ్యాన్ని, లోపాలను పరిశీలించకుండానే ప్రారంభించడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
క్వాంటెల్లా చేతికి టెర్రాసిస్
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థ అనుబంధంగా ఉన్న టెర్రాసిస్‌ను ఆ సంస్థ గతంలో విక్రయించింది. దానికి కొనుగోలు చేసిన సంస్థ తిరిగి విక్రయించగా ఇప్పుడు సత్యం రామలింగరాజు బంధువు శ్రీధర్‌రాజు సంస్థ క్వాంటెల్లా టేకోవర్ చేశారు. ఈ క్వాంటెల్లా కంపెనీ 2015లో స్థాపించింది. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. ఇందలో పనిచేసేది కేవలం 280 మంది మాత్రమే. అయినా ఇంత కీలకమైన ప్రాజెక్టు ఇంత తక్కువ మందికి అప్పగించడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వట్టినాగులపల్లి భూముల కోసమేనా..
ధరణి పోర్టల్ తయారీని డీఫాల్టర్ కంపెనీకి అప్పగించడం వెనుక హైదరాబాద్ శివారులోని లక్షల కోట్ల రూపాయల విలువైన వంద ఎకరాల భూ కుంభకోణం ఉన్నట్లు తెలుస్తోంది. సత్యం కుంభకోణం 2009లో వెలుగు చూసింది. ఈ సందర్భంగీ ఈడీ, సీబీఐ హైదరాబాద్‌లో సత్యం రామలింగరాజుకు వట్టినాగులపల్లిలో ఉన్న వంద ఎకరాల భూమిని అటాచ్ చేసింది. ఇప్పుడు ఈ భూములను లీగల్‌గా మార్కుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించడానికే ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను రామలింగరాజు బంధువు శ్రీధర్‌రాజు కంపెనీ అయిన క్వాంటెల్లాకు అప్పగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తస్యం రామలింగరాజు ఈ భూముల కోసం ఈడీని ఆశ్రయించారు. అయితే రూ.8,500 కోట్ల జరిమానా కట్టి భూములు తీసుకోవాలని ఈడీ అధికారులు తెలిపారు. అంతమొత్తం కట్టడం ఎందుకని కేసీఆర్ సర్కార్ సత్యం రామలింగరాజు బంధువు కంపెనీకి పరోక్షంగా ధరణి సాఫ్ట్‌వేర్ తయారీ బాధ్యతలు అప్పగించడంతోపాటు, భూములను లీగల్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూములను కేసీఆర్, కేటీఆర్ విక్రయిస్తూ వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నార్న ప్రచారం జరుగుతోంది. ఇంత కుంభకోణం ఉన్న ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.