
Telangana Secretariat: సరికొత్త హంగులు, అత్యాధునిక సొగబులతో రూపుదిద్దుకున్న తెలంగాణ కొత్త సచివాలయం సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది. పది రోజుల క్రితం సెక్రటేరియట్ ఫొటోలు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా డ్రోన్ వీడియోను విడుదల చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. మొన్నటి ఫొటోల్లో రాత్రి వెలుగుల్లో సచివాలయం కొత్త అందాలను సంతరించుకుంది. తాజాగా ఉదయం సమయంలో పొగమంచుతో కప్పి ఉన్న సచివాలయం అందాలను కొంతమంది చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పొగమంచులో సరికొత్తగా..
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు దీనిని ప్రారంభించాలనుకున్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ప్రారంభం వాయిదా వేశారు. ఈ క్రమంలో కొత్త సెక్రటేరియట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున పొగమంచులో సచివాలయం ఫొటోలు, వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కొత్త సెక్రటేరియట్‌ను నిర్మించారు. విభిన్నమైన డిజైన్, కొత్త రూపురేఖలు, ఆధునిక సాంకేతికతో నిర్మించిన కొత్త సచివాలయం ఐకానిక్ బిల్డింగ్‌గా మారనుంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న కొత్త సెక్రటేరియట్.. ఇంద్రభవనంలా అనిపిస్తోంది. ఉదయం పొగమంచు, రాత్రి వెలుగులు చిమ్ముతూ కొత్త లుక్‌తో సెక్రటేరియట్ కనిపిస్తోంది. అటువైపుగా వెళ్లే వాహనదారులు, పాదాచారులను సచివాలయ బిల్డింగ్ ఆకట్టుకుంటోంది. పొగమంచులో సెక్రటేరియట్ తాజ్‌మహల్‌ను తలపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మయ సభను తలపిస్తున్న లోపలి డిజైన్లు..
సచివాలయం లోపల ఎలా ఉంటుందనే దానిపై ఇటీవల నిర్మాణ సంస్థ డిజైన్లను విడుదల చేసింది. లోపల అత్యాధునిక ఇంటీరియల్ డిజైన్‌తో రాజభవనంలా తీర్దిదిద్దారు. అత్యాధునిక సౌకర్యాలు ఇందులో కల్పించారు. మయసభను తలపించేలా లోపల ఆకర్షణీయంగా నిర్మించారు. వరదలు, తుఫాన్లను తట్టుకునేలా, దాదాపు 150 ఏళ్లు ఉండేలా భనన నిర్మాణం చేపట్టారు. డైనింగ్ హాల్, మీటింగ్ హాల్‌తోపాటు లోపల అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేశారు. బిల్డింగ్‌పైన గుమ్మటాలపై ముందు భాగంలో ఒకటి, వెనుక భాగంలో ఒకటి జాతీయ చిహ్నం ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ప్రత్యేకంగా వీటిని తయారు చేయించి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. క్రేన్ల సాయంతో వీటిని బిల్డింగ్ పై భాగంలో ప్రతీష్టించారు.