Human Hair Recycled: ఈ సువిశాల ప్రపంచంలో పర్యావరణ కాలుష్యానికి ప్రధాన హేతువు మనిషే.. మంచు కరుగుతున్నా, లేదా ఆ మంచే కురుస్తున్నా, అడవులు ఎండుతున్నా, లేదా ఆ అడవులే మాడుతున్నా.. కరువులు, కాటకాలు, ముంచెత్తే వానలు, ముంచుకొచ్చే వరదలు… ఇలా ఒక్కటేమిటి సమస్త విపత్తులకు మనిషే కారణం. మరి అలాంటి మనిషి ఉత్పత్తుల నుంచి కాలుష్యాన్ని తగ్గిస్తే ఎలా ఉంటుంది? ఆలోచన బాగున్నా .. దీన్ని ఎలా అమలు చేయాలి? ఎలాంటి ప్రయోగాలు చేస్తే కాలుష్యానికి అడ్డుకట్ట పడుతుంది? ప్రస్తుతం బెల్జియం పర్యావరణవేత్తలు ఈ దిశగానే ఆలోచించారు. మనిషి వెంట్రుకలతో కొత్త ప్రయోగాలు చేసి ప్రపంచం మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్నారు.

కేవలం వెంట్రుకలతో
మనిషి శరీరంలో నిరంతరం పెరిగేవి వెంట్రుకలు, గోర్లు… నెత్తి మీద వెంట్రుకలు అదేపనిగా పెరిగితే అందవిహీనంగా ఉంటుంది. ఈ నెలకో, రెండు నెలలకో సెలూన్ కు వెళ్లి కత్తిరించుకోవడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ బెల్జియం లో ఓ ఎన్జీవో సంస్థ ఇలా వెంట్రుకలు సేకరించి వాటిని యంత్రాల ద్వారా మ్యాట్ స్క్వేర్లుగా మారుస్తోంది.. వీటి ద్వారా పర్యావరణాన్ని కలుషితం చేసే చమురు, హైడ్రో కార్బన్లను గ్రహించేందుకు వీటిని ఉపయోగిస్తోంది. ఇంకా చెప్పాలంటే బయో కాంపోజిట్ బ్యాగులుగా ఉపయోగిస్తున్నది. ఆ ఎన్జీవో సంస్థ ఫౌండర్ పాట్రిక్ జాన్సన్ మదిలో ఈ ఆలోచన మెదలడంతో ఈ వినూత్న ప్రయోగానికి నాంది పలికాడు. ఒక కిలోగ్రామ్ జుట్టుతో ఏడు నుంచి ఎనిమిది లీటర్ల నూనె, హైడ్రో కార్బన్లను గ్రహించగలదని చెబుతున్నాడు. ఇటీవల జుట్టుతో తయారుచేసిన మ్యాట్ స్క్వేర్లను నదిలో ఉంచాడు. కాలుష్యానికి ముందు నీటిలో నానబెట్టాడు.. ఆ నీరు కలుషితమైన తర్వాత కూడా అందులో నాన పెట్టాడు.. కలుషితమైన నీటిలో నానబెట్టిన తర్వాత వాటిని పరిశీలించగా అందులో ఉన్న కాలుష్యకారక పదార్థాలను ఆ స్క్వేర్లు శోషించుకోవడం మొదలుపెట్టాయి. ఈ స్క్వేర్లు కొవ్వు, కార్బన్లను గ్రహిస్తాయి.. వెంట్రుకల్లో ఉన్న కెరాటిన్ ఫైబర్ కారణంగా అవి నీటిలో పడగానే సాగుతాయి.. అవి వెంటనే ఆ కాలుష్యకారక ఉద్గారాలను గ్రహించుకుంటాయి.

ఎందుకు వచ్చింది ఈ ఆలోచన
రోజురోజుకు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుంది.. కేవలం కాలుష్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల కొద్ది ప్రజలు చనిపోతున్నారు. మిగతావారు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. పీల్చేగాలి, తాగే నీరు విపరీతంగా కలుషితమవుతోంది. వీటి నివారణకు చెట్లను పెంచడం ఒక మార్గమైతే.. ఆ కాలుష్యకారక ఉద్గారాలను గుర్తించి అడ్డుకట్ట వేయటం… అయితే ఇందులో ఆ రెండో పనిని బెల్జియం పర్యావరణవేత్తలు చేస్తున్నారు. దీనికోసం ఒక ఎన్జీవో సంస్థను ఏర్పాటు చేశారు. బెల్జియం పరిసర ప్రాంతాల్లో వివిధ సెలూన్లలో నిరుపయోగంగా పడేసే జుట్టును సేకరించి వాటి ద్వారా వివిధ రకాల టైల్స్ తయారు చేస్తున్నారు. వీటిని నీటిలో వేయడం ద్వారా అందులో కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బెల్జియం దేశంలో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తున్నారు. వీటిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే విషయంలో ఆ ఎన్జీవో సంస్థ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా బెల్జియం పర్యావరణ వేత్తలు చేసిన ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వడంతో ప్రపంచం మొత్తం వారి వైపు ఆసక్తిగా చూస్తోంది.