
Kapu Community: దేశ రాజకీయాల్లో సామాజికవర్గంపరంగా దగాకు గురైన ఏకకై కులం ‘కాపు’.ఉమ్మడి ఏపీలోనైనా.. విభజిత ఏపీలోనైనా జనాభాలో 20 శాతం దాటి ఉన్న కాపులకు ఇంతవరకూ రాజ్యాధికారం లేదు. ఐదారు శాతం ఉండే కమ్మ, రెడ్డి సామాజికవర్గాల నీడన కాపులు ద్వితీయ శ్రేణిగా బతకాల్సిన పరిస్థితి నెలకొంది. పవర్ వారు తీసుకొని ఆరేడు మంత్రి పదవులు ఇచ్చి కాపులకు ప్రాధాన్యమిస్తున్నట్టు గణాంకాలతో చెప్పి మరీ దగాకు గురిచేస్తున్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న మోసంలో కర్త, కర్మ, క్రియ అంతా కాపులే కావడం గమనార్హం. చివరకు ఈ రాజకీయ క్రీడలో సమిధులుగా మారతున్న వారు కాపులే. రాజకీయ పార్టీల పల్లకి మోసేది వారే. సాటి కుల నాయకులను తిట్టేది వారే. పోనీ ఆర్థికంగానైనా బలోపేతంగా ఉన్నారంటే అదీ లేదు. బీసీలతో సమానంగా ఉన్నా పెద్ద క్యాస్ట్ ట్యాగ్ లైన్ మెడకు కట్టి.. వెనుకబడిన తరగతులకు వర్గ శత్రువులుగా మార్చేశారు. అటు రాజకీయంగా సమాధి కట్టి.. ఇటు రిజర్వేషన్ల పరంగా ఫలాలు దక్కకుండా చేసి దశాబ్దాలుగా కాపులను టార్గెట్ చేసుకుంటూ ఆడుతున్న క్రీడ జుగుప్సాకరంగా ఉంది. ఈ దురాగతాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సింది పోయి స్వప్రయోజనాల కోసం కాపు నేతలు ఇప్పటికీ సాగిలాలు పడుతున్నారు.
లింగాయత్ లే ఆదర్శం..
ఏ రాష్ట్రంలోనైనా కుల రాజకీయాలు అధికంగా ఉంటాయి. ప్రధాన కులాలు ఏ పార్టీకి సపోర్టు చేస్తే అదే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ క్రమంలో పొలిటికల్ పార్టీలు కూడా అదే సామాజికవర్గానికి అగ్రతాంబూలం వేస్తాయి. అదే సామాజికవర్గ నాయకులకు సీఎం పీఠంపై కూర్చోబెడతాయి. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. మెజార్టీ సామాజికవర్గంగా ఉన్న కాపులకు ఇంతవరకూ రాజ్యాధికారం దక్కలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంలో పక్కన ఉన్న కర్నాటకను చూసైనా కనువిప్పు కలగాలి. అక్కడ మెజార్టీ సామాజికవర్గం లింగాయత్ లు. ఆ కులం ఎటు మొగ్గుచూపితే వారితే అధికారం. దశాబ్దాలుగా అక్కడ సామాజికవర్గం ప్రభావం చూపుతోంది. అందుకే రాజకీయ పక్షాలు గుర్తెరిగి ఆ సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్నాయి. ఆ వర్గ నాయకులను ముందుపెట్టి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాలు ఉన్న కర్నాటకలో దాదాపు 100 నియోజకవర్గాల్లో లింగాయత్ ల ప్రభావం అధికం. రాష్ట్ర జనాభాలో వీరు 17 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే అన్ని రాజకీయ పక్షాలు లింగాయత్ లకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చాయి. ఇప్పటివరకూ కర్నాటక రాష్ట్రానికి 23 మంది సీఎంలు పనిచేశారు. అందులో పది మంది లింగాయత్ వర్గానికే చెందిన వారు కావడం విశేషం.
ఆ లెక్కన కాపు సీఎంలు ఎంత మంది?
ఈ లెక్కన ఏపీలో కాపులకు దక్కే ప్రాధాన్యం గురించి అవలోకనం చేసుకుంటే గుండె తరుక్కుపోతుంది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే.. అందులో 100 నియోజకవర్గాల్లో కాపుల ప్రభావం అధికం. 38 నియోజకవర్గాల్లో కాపుల ఆధిపత్యం స్పష్టంగా ఉంది. వీరు బలమైన కుల విధేయతకు పేరుగాంచారు. దాని అనుబంధ ఉపకులాలు దాదాపు 70 నుండి 75 అసెంబ్లీ స్థానాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. ఈ లెక్కన కాపు సామాజికవర్గం వారు ఎన్ని సారు ముఖ్యమంత్రి కావాలి? ఎన్నిసార్లు అయ్యారో స్థుతించుకోవాల్సిన అవసరముంది. పోనీ రాజకీయంగా కాకుంటే రిజర్వేషన్ ఫలాలు దక్కాయంటే అదీ లేదు. రిజర్వేషన్ ఫలాల కోసం పోరాటం చేస్తున్న వంగవీటి మోహన్ రంగా దారుణంగా హత్యకు గురయ్యారు. అటు తరువాత ముద్రగడ రూపంలో ఉద్యమం తారాస్థాయికి చేరుకున్నా.. అది రాజకీయ సమిధగా మారిపోయింది. ఇప్పుడు ఎనిమిది పదుల వయసులో చేగొండి హరిరామజోగయ్య పోరాటం చేస్తున్నా అణచివేసే ప్రయత్నం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాగా వేసిన తొలి రాష్ట్రం కర్నాటక. 1989 వరకూ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. 1989 ఎన్నికల్లో లింగాయత్ వర్గానికి చెందిన నాయకుడు వీరేంద్ర పాటిల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సొంతం చేసుకుంది. 224 స్థానాలకుగాను 178 సీట్లను సొంతం చేసుకుంది. కానీ వీరేంద్ర పాటిల్ అనారోగ్యం బారిన పడి కోలుకుంటున్న సమయంలో రాజీవ్ గాంధీ వెనుకబడిన తరగతులకు చెందిన బంగారప్పను సీఎంగా డిక్లేర్ చేశారు. ఇదే బీజేపీ బలపడానికి టర్నింగ్ పాయింట్ గా పరిశీలకులు అభివర్ణిస్తారు. తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 34 సీట్లకే పరిమితమైంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎంట్రీ ఇచ్చింది. లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్పకు నాయకత్వ పగ్గాలు అప్పగించడంతో ఓట్లు, సీట్లు పెంచుకుంటూ వచ్చింది. దాదాపు లింగాయత్ వర్గం ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి.

దానికి కారకులు కాపులే..
కాపులు సంఘటితమయ్యే చాన్స్ వచ్చిన ప్రతీసారి కాపులే చెడగొట్టుకుంటున్నారు. రాజకీయ సమిధులవుతున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ రూపంలో అరుదైన చాన్స్ వచ్చినా జారవిడుచుకున్నారు. అటు తరువాత పవన్ రూపంలో అవకాశం వచ్చినా సామాజికవర్గం కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. వైసీపీకి ఏకపక్ష విజయం అందించారు. చివరకు పవన్ ను సైతం ఓడించి చేతులు కాల్చుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇక్కడ నుంచి ఒక లెక్క అన్నట్టు కాపుల్లోస్పష్టమైన మార్పు వచ్చింది. అదంతా జనసేన వైపు పోలరైజ్ అవుతోంది. అయితే ఇప్పుడు కూడా కాపులు, దాని అనుబంధ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోంది. దానిని అధిగమించి కాపులు ఐక్యతగా ముందుకెళితే రాజ్యాధికారం ఎంత దూరంలో లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. కర్నాటకలో జేడీఎస్ మాదిరిగా కింగ్ మేకర్ పాత్ర పోషించే చాన్స్ ను పవన్ కు ఇస్తే మాత్రం ఏపీ రాజకీయ పుటల్లో మరో మార్పునకు నాంది పలికిన వారవుతారు. ఇక ఆలోచించుకోవాల్సింది కాపులే..